కన్జ్యూమర్‌ కంపెనీల్లో వాటాలను పెంచుకున్న ఎల్‌ఐసీ

5 Jun, 2020 12:59 IST|Sakshi

హెచ్‌యూఎల్‌లో అత్యధికంగా...

దేశీయ అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ ఈ మార్చి త్రైమాసికంలో వినియోగ ఆధారిత కంపెనీల్లో వాటాలను పెంచుకుంది. హిందుస్తాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మహానగర్ గ్యాస్, హావెల్స్ ఇండియా, అమరా రాజా బ్యాటరీస్‌, టీవీఎస్‌ మోటార్ కంపెనీల షేర్లను తన ఫోర్ట్‌ఫోలియోలో చేర్చుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి క్వార్టర్‌ ధరల సగటును పరిగణలోకి లెక్కిస్తే ఈ మొత్తం వాటా విలువ రూ.1300 కోట్లుగా ఉంది. ఈ క్వార్టర్‌లో పై కంపెనీల్లో ఎల్‌ఐసీ తన వాటాను 0.7 - 0.26శాతం పరిధిలో పెంచుకుంది.

కన్జ్యూమర్‌‌ కంపెనీల్లో అగ్రగామి హెచ్‌యూఎల్‌ కంపెనీలో ఎల్‌ఐసీ అధిక వాటాలను కొనుగోలు చేసింది. ఈ మార్చి క్వార్టర్‌లో హెచ్‌యూఎల్‌ కంపెనీకి చెందిన సుమారు 1శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో హెచ్‌యూఎల్‌లో ఎల్‌ఐసీ వాటా 2.6శాతానికి పెరిగింది. నిఫ్టీ- 50 ఇండెక్స్‌లో అన్ని కంపెనీలతో పోలిస్తే అత్యుత్తమ ఆదాయ వృద్ధి కలిగి ఉంది. అలాగే గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్‌తో విలీనంతో మార్కెట్లో తన వాటాను మరింత పెరగనుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎల్‌ఐసీ హెచ్‌యూఎల్‌లో తన వాటాను పెంచుకొని ఉండవచ్చని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. తాజా వాటా కొనుగోలుతో హెచ్‌యూఎల్‌ కంపెనీలో ఎల్‌ఐసీ అతిపెద్ధ సంస్థాగత పెట్టుబడిదారుగా అవతరించింది. హెచ్‌యూఎల్‌ కంపెనీలో మార్చి 2020 నాటికి దేశీయ మ్యూచువల్‌ ఫండ్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీల వాటాలు వరుసగా 2.9శాతం, 3.4శాతంగా ఉన్నాయి. 

కన్జ్యూమర్ రంగంలోని ఇతర కంపెనీలైన నెస్లే ఇండియా, ఏషియన్‌ పేయింట్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో ఎల్‌ఐసీ తన వాటాలను వరుసగా 2.9శాతం, 2.8శాతం, 6.1శాతానికి పెంచుకుంది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం, మార్చి త్రైమాసికంలో బీఎస్‌ఈ -200 కంపెనీలలో ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ 32 శాతం తగ్గింది. గత క్వార్టర్‌లో ఈ మొత్తం విలువ 82 బిలియన్‌ డాలర్లు ఉండగా ఈ మార్చి క్వార్టర్‌కు 52బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 

మరిన్ని వార్తలు