బ్యాంకింగ్‌ రంగంలోకి ఎల్‌ఐసీ!

30 Jun, 2018 00:36 IST|Sakshi

ఎల్‌ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా!  

రూ.10,000–13,000 కోట్ల స్థాయిలో పెట్టుబడులు  

ఆమోదం తెలిపిన ఐఆర్‌డీఏఐ  

ఎల్‌ఐసీ అనుబంధ సంస్థగా ఐడీబీఐ బ్యాంక్‌ !

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్‌ఐసీ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. భారీ రుణ భారంతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నది. ఐడీబీఐలో ప్రస్తుతం 10.82 శాతంగా ఉన్న వాటాను 51 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసీకి  బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్‌డీఏఐ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్‌లో జరిగిన ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌డీఏఐ) బోర్డ్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ, బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థ, ఆర్‌బీఐల ఆమోదం పొందాల్సి ఉంది. ఎల్‌ఐసీ వాటా కొనుగోలు కారణంగా ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.10,000–13,000 కోట్ల రేంజ్‌లో పెట్టుబడులు లభిస్తాయని అంచనా.

7–10 ఏళ్లలో ఎల్‌ఐసీ తన వాటాను 15 శాతానికి తగ్గించుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి.  పెట్టుబడుల వివరాలు, 51% వాటాను 15 శాతానికి ఎంత కాలంలో తగ్గించుకుంటుందో వంటి అంశాలతో పాటు ఇతర విధి, విధానాలతో కూడిన ప్రణాళికను  త్వరలోనే ఎల్‌ఐసీ సమర్పించనున్నది. ఎల్‌ఐసీ పోటీ బీమా సంస్థలకు సొంత బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు సొంత బ్యాంక్‌తో ఎల్‌ఐసీ మరింత విస్తరిస్తుందని నిపుణులంటున్నారు.  

ఎల్‌ఐసీకి మినహాయింపు...
స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన ఆర్థిక సంస్థల్లో ఏ బీమా సంస్థ కూడా 15 శాతానికి మించి వాటా కొనుగోలు చేయకూడదని  ప్రస్తుత నిబంధనలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా కొనుగోలు కోసం ఈ నిబంధన నుంచి ఎల్‌ఐసీకి ఐఆర్‌డీఏఐ మినహాయింపునిచ్చింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ రంగంలోకి  ప్రవేశించాలన్న ఎల్‌ఐసీ ప్రయత్నాలు ఫలించినట్లే.

ఈ వాటా కొనుగోలు ద్వారా ఐడీబీఐ బ్యాంక్‌కు భారీగా మూలధన పెట్టుబడులు, 22 కోట్ల పాలసీదారుల ఖాతాలు లభిస్తాయి. ఇక ఎల్‌ఐసీ 2,000 బ్రాంచ్‌ల నెట్‌వర్క్‌తో తన పాలసీలను మరింత విస్తృతంగా విక్రయించుకునే అవకాశం దక్కుతుంది. ఎల్‌ఐసీ అనుబంధ సంస్థగా ఐడీబీఐ బ్యాంక్‌ కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే హౌసింగ్‌ ఫైనాన్స్, మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఎల్‌ఐసీకి అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.  

వాటాదారులకు మంచి విలువ..
ఈ ఏడాది మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్‌ మొండి బకాయిలు రూ.55,600 కోట్లకు చేరాయి. గత ఆర్థి క సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో ఐడీబీఐ బ్యాంక్‌ నికర నష్టాలు రూ.5,663 కోట్లకు చేరాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా కొనుగోలు కారణంగా ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 80.96 శాతం నుంచి 50 శాతం దిగువకు తగ్గుతుంది.

ఈ వాటా విక్రయం వల్ల లభించే పెట్టుబడులు ప్రభుత్వ ఖజానాకు కాకుండా ఐడీబీఐ బ్యాంక్‌ పునరుజ్జీవనానికి వినియోగిస్తారు. ఎల్‌ఐసీ వాటా కొనుగోలు కారణంగా మొండి బకాయిల సమస్య తీరిపోయి ఐడీబీఐ బ్యాంక్‌ వాటాదారులకు మంచి విలువ చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఐదు బ్యాంకుల్లో ఎల్‌ఐసీకి వాటాలు..
ఇప్పటికే ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎల్‌ఐసీకి 10 శాతం చొప్పున వాటాలున్నాయి. ఎల్‌ఐసీకి ఎస్‌బీఐలో 9.98%, అలహాబాద్‌ బ్యాంక్‌లో 12.37%, కార్పొరేషన్‌ బ్యాంక్‌లో 13.03 శాతం చొప్పున వాటాలున్నాయి.

ఒక బ్యాంక్‌లో నియంత్రిత వాటా ఉన్న కంపెనీకి,  ఇతర బ్యాంక్‌ల్లో 5 శాతానికి మించి వాటా ఉండకూడదనే నిబంధనలున్నాయని, ఫలితంగా ఈ బ్యాంకుల్లో తన వాటాను ఎల్‌ఐసీ తగ్గించుకోవలసి రావచ్చని నిపుణులంటున్నారు. కాగా గత వారమే ఐడీబీఐ బ్యాంక్‌ సీఈఓగా ఎస్‌బీఐ ఎమ్‌డీ. బి. శ్రీరామ్‌ను ప్రభుత్వం నియమించింది. మూడు నెలల కాలానికే ఈ నియామకం జరిగినప్పటికీ, దీర్ఘకాలం పాటే ఆయన సీఈఓగా కొనసాగే అవకాశాలున్నాయి.

10 శాతం పెరిగిన ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌
ఎల్‌ఐసీ వాటా కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ జోరుగా పెరిగింది. 10 శాతం లాభంతో రూ.54.90 వద్ద ముగిసింది. బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,567 కోట్లు పెరిగి రూ.22,955 కోట్లకు చేరింది.

ఎల్‌ఐసీకి వాటా విక్రయం వద్దు....
ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా కొనుగోలును ఆల్‌ ఇండియా బ్యాంక్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది.  ఈ మేరకు ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌కు ఏఐబీఈఏ కార్యదర్శి సీహెచ్‌. వెంకటాచలం శుక్రవారం ఒక లేఖ రాశారు.

ఐడీబీఐ బ్యాంక్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకుండా చూస్తామని ఐడీబీఐను 2003లో ఐడీబీఐ బ్యాంక్‌గా మారుస్తున్న సందర్భంలో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ  హామీ వల్లే ఆ బిల్లు ఆమోదం పొందిందని  ఈ లేఖలో ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్‌ఐసీ భారీ నిరర్థక ఆస్తులతో నిండిపోయిందని, నష్టాల్లో ఉన్న సంస్థలన్నింటినీ ఎల్‌ఐసీ నిధులతో గట్టెక్కించడం సరికాదని ఆయన విమర్శించారు. మొండి బకాయిల పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అంతే కానీ మరిన్ని నిధులు గుమ్మరించడం సరైన పరిష్కారం కాదని ఆయన ఆక్షేపించారు. 

మరిన్ని వార్తలు