రుణాలకు పెరుగుతున్న డిమాండ్‌

5 Jun, 2019 08:30 IST|Sakshi

ఈ ఏడాది 10–12 శాతం వృద్ధి

రికవరీ అవకాశాలు మెరుగు

వార్షిక నివేదికలో ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టంచేసింది. రుణాలకు తిరిగి డిమాండ్‌ ఏర్పడుతుండడం, రుణాల వసూళ్ల అవకాశాలు మెరుగుపడడంతో ఈ లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. బలమైన వ్యాపార వృద్ధితోపాటు తగినంత మూలధనం, లిక్విడిటీ, మార్కెట్‌ లీడర్‌గా రుణాలపై తగినంత మార్జిన్‌ వసూలు చేసే సామర్థ్యాలు బ్యాంకుకు ఉన్నాయని 2018–19 వార్షిక నివేదికలో బ్యాంకు వివరించింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల పాటు రుణాలకు వృద్ధి తక్కువగా ఉన్న తర్వాత 2018–19లో కార్పొరేట్‌ రంగం నుంచి రుణాలకు డిమాండ్‌ తిరిగి నెలకొందని, అలాగే, వ్యక్తిగత రుణాల్లోనూ డిమాండ్‌ ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ.862 కోట్ల స్టాండెలోన్‌ లాభాన్ని, రూ.2,300 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని నమోదు చేసింది. సకాలంలో వసూలు కాక మాఫీ చేసిన రుణాల్లో 57 శాతాన్ని ఎస్‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసుకోగలిగింది.

మరిన్ని వార్తలు