అర్హతల మేరకే రుణం

2 Apr, 2018 00:47 IST|Sakshi

వ్యక్తిగత సంబంధాలు నేరాలకు దారితీయవు

ఐసీఐసీఐ కొచర్‌తో క్విడ్‌ ప్రో కో ఆరోపణలపై వీడియోకాన్‌ చైర్మన్‌ ధూత్‌

ముంబై/న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు జారీ చేసిన రూ.3,250 కోట్ల రుణం వెనుక అవినీతి ఉందంటూ వచ్చిన ఆరోపణలను గ్రూపు చైర్మన్‌ వేణుగోపాల్‌ధూత్‌ ఖండించారు. రుణం మంజూరుకు ఆమోదం తెలిపిన ఐసీఐసీఐ బ్యాంకు ప్యానల్‌లోని 12 మంది కూడా తనకు తెలుసునని, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు నేరపూరిత చర్యలకు దారితీయవన్నారు.

వీడియోకాన్‌ గ్రూపు చైర్మన్‌ ధూత్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యుల మధ్య ‘నీకు అది, నాకు ఇది’(క్విడ్‌ ప్రో కో) అనే తరహాలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ ప్రాథమిక విచారణ కూడా చేస్తున్న విషయం విదితమే. ఈ ఆరోపణలను ఐసీఐసీఐ బ్యాంకు ఖండించడంతోపాటు చందాకొచర్‌కు బాసటగా నిలిచింది. ఈ నేపథ్యంలో ధూత్‌ దీనిపై మాట్లాడుతూ... ఐసీఐసీఐ బ్యాంకు 12 మంది సభ్యుల రుణ ప్యానల్‌లో చందాకొచర్‌ ఒకరని పేర్కొన్నారు.

ఆమెతోపాటు కమిటీ హెడ్‌గా ఉన్న కేవీ కామత్, మొత్తం 12 మంది కూడా తనకు తెలుసునని, కామత్‌తో భోజనాలు కూడా చేస్తుంటానని తెలిపారు. వ్యక్తిగత సంబంధాలు నేరాలకు ప్రాతిపదిక కాదన్నారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రాజెక్టులకు అర్హతల ప్రాతిపదికనే బ్యాంకు రుణం మంజూరు అయింది. ఇందులో అవినీతి లేదు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణం ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా భాగం. మొత్తం రుణంలో ఈ బ్యాంకు వాటా 10 శాతంలోపే ఉంది’’ అని ధూత్‌ స్పష్టం చేశారు. సీబీఐ తన ముందుకు వచ్చిన ప్రతీ ఆరోపణపైనా విచారణ చేస్తుంటుందని, ఇందులో బోగస్‌ ఫిర్యాదులు కూడా ఉంటాయన్నారు.  

మరిన్ని వార్తలు