బెంట్లీ కారుకు... రూ.10 కోట్లయినా వెనుకాడరు!

28 Oct, 2017 00:38 IST|Sakshi

ఒక్కో కారు తయారీకి 6 నెలలు

ఎక్స్‌క్లూజివ్‌ మోటార్స్‌ ఎండీ సత్య

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంట్లీ.. సూపర్‌ లగ్జరీ కార్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న బ్రాండ్‌. సామాన్యుడి ఊహలక్కూడా అందని ధర వీటి ప్రత్యేకత. కొనుగోలు చేసే కస్టమర్‌ తనకు నచ్చినట్టుగా రంగులు, ఇంటీరియర్, యాక్సెసరీస్, ఎక్స్‌టీరియర్‌ను ఎంచుకోవచ్చు. కారు లోపలి భాగాలన్నీ చాలామటుకు చేతితో తీర్చిదిద్దినవే. కారు తయారీకి ఎంత కాదన్నా ఆరు నెలల సమయం పడుతోందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఇలా కస్టమైజేషన్‌ కారణంగా భారత్‌లో కారు ధర రూ.10 కోట్ల వరకూ వెళ్తోంది. దేశంలో ఇప్పటి వరకు 500 కార్లు అమ్ముడయ్యాయి. 100కు పైగా రంగులను కస్టమర్లు ఎంచుకున్నారు. తొలి స్థానం తెలుపు రంగు కైవసం చేసుకుంది. బెంట్లీకి చెందిన నాలుగు మోడళ్లు దేశీయ మార్కెట్లోనూ లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఏటా 10,000 పైగా బెంట్లీ కార్లు రోడ్లపై దూసుకెళ్తున్నాయి.

భాగ్యనగరిలో 40 కార్లు..
హైదరాబాద్‌ రోడ్లపై 40 దాకా బెంట్లీ కార్లు హుందా ఒలకబోస్తున్నాయి. నిజాం కాలం నుంచే భాగ్యనగరి వాసులు లగ్జరీ కార్ల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ప్రీమియం లగ్జరీ కార్ల విక్రయంలో ఉన్న ఎక్స్‌క్లూజివ్‌ మోటార్స్‌ ఎండీ సత్య బగ్ల శుక్రవారం తెలిపారు. భారత్‌లో మూడో షోరూంను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఇక్కడి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే షోరూమ్‌ను తెరిచామన్నారు. కస్టమైజేషన్‌కు అయ్యే ఖర్చు గురించి ఇక్కడివారు వెనక్కి తగ్గరని చెప్పారు. భారత్‌లో లగ్జరీ కార్లకు దిగుమతి సుంకం 202 శాతం ఉండటం, మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వంటి అడ్డంకులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలో రూ.3 కోట్లపైగా ధర కలిగిన వివిధ కంపెనీల కార్లు ఏటా 150 దాకా అమ్ముడవుతున్నాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు