ఉద్యోగాలకు ఆకర్షణీయ కంపెనీ... గూగుల్

24 Apr, 2015 00:06 IST|Sakshi
ఉద్యోగాలకు ఆకర్షణీయ కంపెనీ... గూగుల్

న్యూఢిల్లీ: దేశీయంగా ఉద్యోగాలకు ఆకర్షణీయమైన సంస్థగా ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ నిల్చింది. వివిధ విభాగాల కంపెనీలపై మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ రాండ్‌స్టాడ్ 2015 సంవత్సరానికి గాను నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. రంగాలవారీగా చూసినప్పుడు తయారీకి సంబంధించి టాటా స్టీల్, ఎఫ్‌ఎంసీజీ విభాగంలో పీఅండ్‌జీ, ఆటోమొబైల్ విభాగంలో హోండా ఇండియా అగ్రస్థానంలో నిల్చాయి.

వీటితో పాటు ఉద్యోగాలకు ఆకర్షణీయమైన కంపెనీల్లో కాగ్నిజెంట్, హెచ్‌పీ, హెచ్‌పీసీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ తదితర సంస్థలు ఉన్నాయి. భారత ఎకానమీతో పాటు జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్నాయని రాండ్‌స్టాడ్ ఇండియా సీఈవో మూర్తి కె. ఉప్పలూరి తెలిపారు. కంపెనీ ఆకర్షణీయంగా నిలవడానికి సంబంధించి జీతభత్యాలు, ఉద్యోగులకు సదుపాయాలు (54%) , ఉద్యోగ భద్రత (49%) మొదలైనవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మరిన్ని వార్తలు