రెండు రెట్లు పెరిగిన మహీంద్రా  ఫైనాన్షియల్స్‌ లాభం

25 Oct, 2018 02:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌  నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.164 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.381 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం, ఇతర ఆదాయం కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.1,540 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 40 శాతం వృద్ధితో రూ.2,148 కోట్లకు పెరిగింది.  

39 శాతం అప్‌... 
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.21,194 కోట్ల రుణాలిచ్చామని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇచ్చిన రుణాలు(రూ.15,206 కోట్లు)తో పోల్చితే 39 శాతం వృద్ధి సాధించామని మహీంద్రా ఫైనాన్స్‌ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి రూ.47,213 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి 26 శాతం వృద్ధితో రూ.59,473 కోట్లకు పెరిగాయని పేర్కొంది. తమ మొత్తం ఖాతాదారుల సంఖ్య 56 లక్షలకు పెరిగిందని వివరించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో వినియోగదారులకు ఈ కంపెనీ ఆర్థిక సేవలను అందిస్తోంది. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లకు రుణాలను, చిన్ని, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు కూడా రుణాలందిస్తోంది.  మహీంద్రా ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్, మహీంద్రా రూరల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, మహీంద్రా ఫైనాన్స్‌... ఈ అనుబంధ సంస్థలతో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నికర లాభం రెండు రెట్లు పెరగడంతో బీఎస్‌ఈలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌  షేర్‌ 7.5 శాతం లాభంతో రూ.401 వద్ద ముగిసింది.    

>
మరిన్ని వార్తలు