బజాజ్‌ ఆటో లాభం 1,257 కోట్లు 

25 Oct, 2018 02:20 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం, బజాజ్‌ ఆటో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో 5 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.1,194 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,257 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఆటో తెలిపింది. దేశీయంగా అమ్మకాలు బాగా ఉండడం, ఎగుమతులు కూడా పెరగడం వల్ల ఈ స్థాయిలో నికర లాభం సాధించామని వివరించింది. గత క్యూ2లో రూ.6,566 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.7,987 కోట్లకు పెరిగింది. ఎబిటా 3.4 శాతం పెరిగి రూ.1,343 కోట్లకు పెరిగిందని, కానీ ఎబిటా మార్జిన్‌ 2.9 శాతం క్షీణించి 16.8 శాతానికి తగ్గిందని తెలిపింది. ఇతర ఆదాయం 29 శాతం పెరిగి రూ.382 కోట్లకు పెరిగినా, పన్ను వ్యయాలు 23 శాతం పెరిగి రూ.500 కోట్లకు చేరాయని పేర్కొంది. కంపెనీ ఆదాయం, నికర లాభం విశ్లేషకుల అంచనాలను అందుకోగలిగాయి. కానీ ఎబిటా, ఎబిటా మార్జిన్‌లు అంచనాలు అందుకోలేకపోయాయి. కాగా ఈ ఏడాది జూన్‌ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.16,889 కోట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. 

తగ్గిన మార్జిన్‌... 
ఈ కంపెనీ ఇప్పటివరకూ 20 శాతం ఎబిటా మార్జిన్‌ సాధిస్తూ వస్తోంది. కానీ, ఈ క్యూ2లో ఎబిటా మార్జిన్‌ 16.8 శాతానికి పడిపోయింది.  జూన్‌ క్వార్టర్‌లో ఈ మార్జిన్‌ 17.3 శాతంగా ఉంది. ఈ క్యూ2లో ధరలు తగ్గించడం ఎబిటా మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. మొత్తం టూ వీలర్ల అమ్మకాల్లో మూడో వంతు ఉండే సీటీ 100 బైక్‌ ధరను ఈ కంపెనీ రూ.2,000 వరకూ తగ్గించింది. దీంతో అమ్మకాలు పెరిగినా, మార్జిన్‌ మాత్రం తగ్గింది. కాగా రానున్న రెండు క్వార్టర్లలో కూడా మార్జిన్‌ ఇదే రేంజ్‌లో ఉండొచ్చని కంపెనీ కమర్షియల్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ శర్మ అంచనా వేస్తున్నారు. 

25 శాతం పెరిగిన వాహన విక్రయాలు... 
వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 25 శాతం పెరిగాయని బజాజ్‌ ఆటో తెలిపింది.  గత క్యూ2లో 10.71 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 13.39 లక్షలకు ఎగిశాయని పేర్కొంది. మోటార్‌ బైక్‌ల అమ్మకాలు 23 శాతం వృద్ధితో 11.26 లక్షలకు చేరాయని తెలిపింది. ఎగుమతులు 33 శాతం పెరిగి 5.35 లక్షలకు చేరాయని తెలిపింది. నిర్వహణ మార్జిన్‌ బలహీనంగా ఉండటం, పన్ను వ్యయాలు అధికం ఉండడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపించడంతో బజాజ్‌ ఆటో షేర్‌ బీఎస్‌ఈలో ఏడాది కనిష్టానికి, రూ.2,460కు పడిపోయింది. చివరకు 4.3 శాతం నష్టంతో రూ.2,475 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన రెండో షేర్‌ ఇది. 

ఈడీగా రాకేశ్‌ శర్మ నియామకం  
కంపెనీ అదనపు డైరెక్టర్, హోల్‌–టైమ్‌ డైరెక్టర్‌గా రాకేశ్‌ శర్మను బజాజ్‌ ఆటో కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ నియమించింది. ఆయన 2019, జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కంపెనీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు