మూడు రోజూ లాభాల ప్రారంభమే..!

28 May, 2020 09:26 IST|Sakshi

107 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు

కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడోరోజూ లాభంతో మొదలైంది. గురువారం సెన్సెక్స్‌ 107 పాయింట్ల లాభంతో 31713 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 9344.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం కూడా మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరించింది. అయితే నేడు మే నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు తేది కావడంతో పాటు టీవీఎస్‌ మోటర్‌, లుపిన్‌, ఫెడరల్‌ బ్యాంక్‌లతో సహా సుమారు 24 కంపెనీలు తమ మార్చి క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 265 పాయింట్ల లాభంతో  31870 వద్ద, నిప్టీ 75 పాయింట్లు పెరిగి 9390.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫైనాన్స్‌, అటో రంగ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే... లాక్‌డౌన్‌ మరింత సడలింపుతో ఆర్థిక పునరుద్ధరణపై ఆశావాద అంచనాలతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్‌ లాభాల్లో  ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ సూచీలను ముందుండి నడిపించాయని చెప్పవచ్చు. ఫలితంగా మార్చి 5 తర్వాత ఎస్‌అండ్‌పీ తొలిసారి 3000 పైన 1.50శాతం లాభంతో ముగిసింది. డోజోన్స్‌ ఇండెక్స్‌ 2.2శాతం, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 0.75శాతం లాభంతో ముగిశాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌, తైవాన్‌, ఇండోనేషియా, థాయిలాండ్‌ చెందిన స్టాక్‌ సూచీల్లో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. చైనా, హాంగ్‌కాంగ్‌, కొరియా, సింగపూర్‌ దేశాలకు చెందిన సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

 టాటామోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటాస్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. బజాజ్‌ అటో, విప్రో, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా