మోబిక్విక్‌ రూ.300 కోట్లు పెట్టుబడులు

24 Feb, 2017 01:44 IST|Sakshi
మోబిక్విక్‌ రూ.300 కోట్లు పెట్టుబడులు

సూపర్‌ క్యాష్‌పేరుతో రివార్డ్‌ పాయింట్లు
న్యూఢిల్లీ:  డిజిటల్‌ వాలెట్‌ కంపెనీ మోబిక్విక్‌ ఈ ఏడాది రూ.300 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. లాయల్టీ పాయింట్లు అందించడం, వినియోగదారులు, వర్తకుల సంఖ్యను పెంచుకోవడం కోసం ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని మోబిక్విక్‌ వైస్‌  ప్రెసిడెంట్‌ (గ్రోత్‌)  డామన్‌ సోనీ చెప్పారు. తమ వద్దనున్న నగదు నిల్వలు, తాజా రుణాలతో ఈ నిధులను సమీకరిస్తామని పేర్కొన్నారు.  ఈ ఏడాది భారత్‌లో తమ వినియోగదారుల సంఖ్య 5.5 కోట్ల నుంచి 15 కోట్లకు, వర్తకుల సంఖ్య 14 లక్షల నుంచి  50 లక్షలకు పెరగగలదని అంచనాలున్నాయని వివరించారు.  ఈ ఏడాది మరిన్ని ఆర్థిక సేవలను అందుబాటులోకి తేనున్నామని పేర్కొన్నారు. తాజాగా సూపర్‌క్యాష్‌ పేరుతో రివార్డ్‌ పాయింట్లను ఆఫర్‌ చేస్తున్నామని వివరించారు.

మొబిక్విక్‌ వాలెట్‌ను ఉపయోగిస్తే వినియోగదారులకు డిస్కౌంట్లు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. వివిధ నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఈ ఏడాది మార్చికల్లా 13 నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నారని, కొన్ని నెలల్లో ఈ సంఖ్యను 1,400కు పెంచుకోనున్నామని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా మోబిక్విక్, పేటీఎమ్‌వంటి డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫార్మ్‌ల వినియోగదారుల సంఖ్య జోరుగా పెరిగింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత 13 లక్షల మంది వ్యాపారస్తులు, 1.5 కోట్ల మంది వినియోగదారులు పెరిగారని సోనీ వివరించారు. అలీబాబా అండతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పేటీఎమ్‌తో ఈ సంస్థ పోటీ పడుతోంది. ఈ కంపెనీ ఇప్పటివరకూ 8.5 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. మీడియా టెక్, సెక్వోయా క్యాపిటల్, జీఎంఓ వెంచర్‌ పార్ట్‌నర్స్, ట్రీలైన్‌ ఏషియా, సౌత్‌ ఆఫ్రికా నెట్‌వన్‌ సంస్థల నుంచి పెట్టుబడులను పొందింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా