కొపాక్సోన్‌పై నాట్కో ఫార్మాకి దెబ్బ

2 Apr, 2014 01:35 IST|Sakshi
కొపాక్సోన్‌పై నాట్కో ఫార్మాకి దెబ్బ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసి అధికాదాయం పొందుదామనుకున్న నాట్కో ఫార్మా ఆశలపై టెవా ఫార్మా నీళ్లు జల్లింది.  నాడీ సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగించే కొపొక్సొన్ పేటెంట్ హక్కులపై టెవా ఫార్మా లేవనెత్తిన వాదనలు వినడానికి అమెరికా సుప్రీంకోర్టు సమ్మతించింది. వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ఫార్మా రంగం సిద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు టెవా సుప్రీంకోర్టుకు ఎక్కడంతో జాప్యం తప్పకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 కానీ గత ఏడాది అమెరికాలోని కింది కోర్టు ఇతర కంపెనీలతో కలిసి ఈ ఔషధాన్ని విక్రయించడానికి నాట్కోకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కొపాక్జోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రపంచ జెనరిక్ ఔషధ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న టెవా వ్యాపారంలో 20 శాతం కొపాక్జోన్ నుంచి వస్తుండటమే కాకుండా, లాభాల్లో 50 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది అమెరికాలో కొపాక్సొన్ అమ్మకాల విలువ రూ. 25,200 కోట్లుగా నమోదయ్యింది.

 నమ్మకం ఉంది
 టెవాకి చెందిన 808 పేటెంట్ చెల్లదన్న నమ్మకాన్ని నాట్కో ఫార్మా వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మైలాన్, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి కొపాక్సొన్‌ను అమెరికాలో విక్రయించడానికి నాట్కోకి గతేడాది అనుమతి లభించింది. ప్రస్తుత వార్తల నేపథ్యంలో మంగళవారం నాట్కో ఫార్మా షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 14శాతం నష్టపోయి రూ.685 వద్ద ముగి సింది. కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌పై నాట్కో హక్కులు పొందినప్పటి నుంచి ఆదాయం బాగా పెరుగుతుం దన్న అంచనాతో నాట్కో ఫార్మా షేరు దూసుకుపోయింది. ఇప్పుడు ఈ అంశం తిరిగి కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారని, ప్రస్తుత స్థాయి నుంచి 10 శాతం మించి పతనం అయ్యే అవకాశాలు కనిపించడం లేదని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా