ఉద్యోగులు కూడా ఆస్తుల అటాచ్ మెంట్ కోరవచ్చు

23 May, 2016 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ : కొత్త దివాలా బిల్లు ప్రకారం రుణదాతలు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సైతం కంపెనీ దివాలా తీసినప్పుడు ప్రమోటర్ల స్థిర ఆస్తులను (విదేశీ ఆస్తులు సైతం) అటాచ్ చేయమని  కోరొచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. రుణాలకు గ్యారెంటీగా, బకాయిలను తిరిగి పొందడానికి ఈ ఆస్తులను ప్రమోటర్లు చూపించాలని పేర్కొన్నారు. ఈ ఆస్తులే కంపెనీ దివాలా తీసినప్పుడు రుణాల పరిష్కారానికి, ఉద్యోగులకు, పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం జరగకుండా గ్యారెంటీగా ఉంటాయని చెప్పారు. రుణ సమస్యల సత్వర పరిష్కారం కోసం.. రుణదాతలకు, ప్రజలకు మేలు కలిగేలా దివాలా బిల్లును ఈ నెల మొదట్లో పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.

ఉద్యోగులు, రుణదాతలు, పెట్టుబడిదారులు ఎక్కువగా ఆర్థిక ఒత్తిడిలను ఎదుర్కొంటారని దాస్ చెప్పారు. 9నెలల స్పష్టత కాలం అనంతరం కూడా రుణ సమస్య కొనసాగితే, ప్రమోటర్లు రుణానికి గ్యారెంటీగా ఇచ్చిన అన్నీ స్థిర ఆస్తులను(విదేశ ఆస్తులు కూడా కలుపుకుని) అటాచ్ చేయమని ఉద్యోగులు, పెట్టుబడిదారులు ఎవరైనా కోరచ్చని తెలిపారు.  ఏ కంపెనీని, ఏ కేసును నొక్కి ఈ కామెంట్ చేయడం లేదన్నారు.  బ్యాంకులకు రూ.9వేల కోట్లను ఎగొట్టి వ్యాపారవేత్త విజయ్ మాల్యా విదేశాల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టంతో ఆర్థిక రంగ రూపురేఖలే మారబోతున్నాయని దాస్ చెప్పారు. ఓ కొత్త, శక్తివంతమైన ఎకో సిస్టమ్ ను ఆర్థిక ఒత్తిడిలో కూరుకుపోయిన కంపెనీల కోసం రూపొందిస్తున్నామని తెలిపారు. రుణ సమస్యలు సత్వరమే పరిష్కరించేలా ఈ సిస్టమ్ తోడ్పడుతుందన్నారు. అయితే మొదట రెజల్యూషన్ ప్రాసెస్ ను ఆరంభించడానికి ప్రతి స్టాక్ హోల్డర్ హక్కు కలిగి ఉంటారన్నారు. రుణదాతలు, ఆర్థిక రుణదాతలు, నిర్వహణ రుణదాతలు, వర్క్ మెన్, ఉద్యోగులు ఈ స్టాక్ హోల్డర్ జాబితాలోకి వస్తారని దాస్ చెప్పారు.

మరిన్ని వార్తలు