నష్టాల దెబ్బకు.. నైక్ విలవిల

24 Sep, 2016 02:26 IST|Sakshi
నష్టాల దెబ్బకు.. నైక్ విలవిల

దేశంలో 30% స్టోర్ల మూసివేత
* భాగస్వాముల సంఖ్య కూడా కుదింపు
* బ్యాట్స్ స్పాన్సర్‌షిప్‌పై పునరాలోచన

ప్రపంచ దిగ్గజ స్పోర్ట్స్‌వియర్ తయారీ కంపెనీ ‘నైక్’ తాజాగా భారత్‌లో దాదాపు 35 శాతం స్టోర్లను మూసివేసింది. నష్ట నివారణలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనికి దేశంలో 200 స్టోర్లు ఉన్నాయి. ఈ అంశాల గురించి నైక్ ఇండియా ప్రతినిధిని సంప్రదిస్తే.. అయన ఎలాంటి సమాధానమివ్వలేదు. నైక్ కంపెనీ దేశంలో తన భాగస్వాముల సంఖ్యను కూడా తగ్గించుకుంటునట్లు తెలుస్తోంది. తన కార్యకలాపాలను 3-4 భాగస్వాముల ద్వారా నిర్వహించే అవకాశముంది.

కాగా కంపెనీకి ఇది వరకు 20 వరకూ భాగస్వాములు ఉన్నారు. నైక్‌కు ఎస్‌ఎస్‌ఐపీఎల్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. దీని తర్వాతి స్థానంలో ఆర్‌జే కార్ప్ ఉంది. ఈ మధ్యకాలంలో చాలా నైక్ స్టోర్లు మల్టీబ్రాండెడ్ ఔట్‌లెట్స్‌గా మారాయి.
 
రూ.541 కోట్ల నష్టాలు
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గణాంకాల ప్రకారం.. 2014-15లో నైక్ మొత్తం నష్టాలు రూ.541 కోట్లుగా నమోదయ్యాయి. కాగా నైక్ ప్రత్యర్థులైన అడిడస్ నష్టాలు రూ.68 కోట్లుగా, రీబాక్ నష్టాలు రూ.2,198 కోట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 2015తో ముగిసిన ఏడాదిలో ప్యూమ లాభాలు రూ.47 కోట్లుగా నమోదయ్యాయి.
 
బ్యాట్స్ స్పాన్సర్‌షిప్ ఉంటుందా?
ఇండియన్ క్రికెటర్లకి బ్యాట్స్‌ని స్పాన్సర్‌షిప్ చేసే వ్యూహాన్ని నైక్ పునఃసమీక్షించుకుంటోంది. నైక్ సంస్థ అజింక్య రహానే, అశ్విన్, రవీంద్ర జడేజా, పార్థివ్ పటేల్ వంటి పలు  క్రికెటర్లకు కిట్స్, బ్యాట్స్‌ను అందించడానికి ఏడాదికి రూ.60 కోట్ల వరకూ వెచ్చిస్తోంది. ఒక కంపెనీ ఎక్కడైనా క్రికెటర్‌కు బ్యాట్‌ను స్పాన్సర్ చేయాలంటే రూ.25 లక్షల నుంచి రూ.8 కోట్ల వరకూ ఖర్చవుతుంది. కోహ్లి.. బ్యాట్ స్పాన్సర్‌షిప్ రూ.8 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన మార్కెటింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోవడం వల్ల నైక్‌కు నష్టాలు పెరిగాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కంపెనీ రిటై ల్ మార్కెట్ విస్తరణ ప్రణాళికలు కూడా సరిగ్గా లేవని పేర్కొన్నారు. దీంతో చాలా స్టోర్లు మూతపడ్డాయని తెలిపారు.

మరిన్ని వార్తలు