నాలాలపై ఆక్రమణల తొలగింపు

24 Sep, 2016 02:24 IST|Sakshi
నాలాలపై ఆక్రమణల తొలగింపు

మంత్రి కేటీఆర్ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్‌లో నాలాలపై ఆక్రమణలను తొలగించి కిర్లోస్కర్ కమిటీ నివేదికకు అనుగుణంగా వాటిని ఆధునీకరించనున్నట్లు రాష్ట్ర మునిసిపల్ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇక్కడ జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌రూమ్‌లో మంత్రులు లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, మేయర్ రామ్మోహన్‌లతో కలసి మీడియాతో  మాట్లాడారు. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు తనతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు నగర్‌లోని నాలాలు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు.

కుత్బుల్లాపూర్‌లో పర్యటించిన తలసాని అక్కడ నాలాపైనే ఒక ఫంక్షన్‌హాల్ అడ్డుగోడ నిర్మించినట్లు గుర్తించారన్నారు. అలాంటి నిర్మాణాల వల్లే వరద సమస్యలు తీవ్రమవుతున్నాయని, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.  భండారి లేఔట్‌లో మాత్రం ఇంకా సాధారణ పరిస్థితి లేదని చెప్పారు. వర్షం వెలిశాక నెల, నెలన్నరపాటు తామంతా రోడ్లపైనే ఉంటామని, వాటిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఏదైనా కఠినచర్యలు తీసుకోవాలంటే ప్రాంతీయతత్వం తదితరమైనవి ఆపాదిస్తారని, భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.  అవసరమైతే సైన్యంతోపాటు హెలికాప్టర్లను వినియోగించేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు.   

 ఇంకా ఆయన ఏమన్నారంటే..
► నగరంలో 1, 2 ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందులున్నాయి. అక్కడ హైఅలర్ట్‌తో ఉన్నాం. 100 లేదా 040-21 11 11 11 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
► ఎన్టీఆర్ మార్గ్‌లోని గుంతకు కారణమైన పైప్‌లైన్ పరిశీలనకు ఢిల్లీ నుంచి ప్రత్యేక కన్సల్టెంట్ రాక. సీసీటీవీ ద్వారా పైప్‌లైన్ ఆసాంతం పరిశీలన
► జీహెచ్‌ఎంసీ తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కంట్రోల్‌రూమ్‌లు
► బాధితులకు భోజనాలందించేందుకు ముందుకు వచ్చిన హరేకృష్ణ ఫౌండేషన్, ప్రైవేట్ ఆస్పత్రులు, ఇతర సంస్థలు. పదివేల మందికి భోజన ఏర్పాట్లు
► సోషల్ మీడియా  తదితర మాధ్యమాల్లో భయపెట్టే పుకార్లను నమ్మవద్దు. హుస్సేన్‌సాగర్‌కు ముప్పులేదు
► అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ చర్యలు

 సురక్షిత ప్రాంతాలకు తరలండి
 నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని  కేటీఆర్ సూచించారు. శుక్రవారం రాత్రి హుస్సేన్ సాగర్‌ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోత ట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలను హైఅలర్ట్ ప్రకటించారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి,  పటాన్ చెరువు, శేరిలింగంపల్లి లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. హుస్సేన్‌సాగర్‌లోకి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి సాగర్‌లోకి ఎగువ భాగం 4500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువన 4000 క్యూసెక్కులను వదులుతున్నారు. రాత్రి పదిగంటల నాటికి ఎఫ్‌టీఎల్  513.81కు చేరుకుంది.
 
 ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక కమిటీ
 అడ్డగోలుగా నాలాలను ఆక్రమించి, బహుళ అంతస్తులు నిర్మించి వర్షం వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలను సమస్యల పాల్జేస్తున్న ఆక్రమణదారుల  భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు మునిసిపల్ మంత్రి కేటీఆర్ శుక్రవారం మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్  వివిధ విభాగాల అధికారులు, అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నగరంలో నాలాలపై వెలసిన ఆక్రమణలను గుర్తించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(ఐటీ), చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ ఇంజనీర్లతో ప్రత్యేక కమిటీని నియమించారు.

ఈ కమిటీ పదిరోజుల్లో నివేదిక అందజేయనుంది.  సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రభుత్వ, ప్రైవేటు  భవనాలను గుర్తించి నివేదికలో పొందుపర్చనుంది. వాటిని తొలగించేందుకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అక్రమార్కులు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ముందుగా బడాబాబుల ఆక్రమణలనే తొలగించాలని, బెంగళూర్ తరహాలో వారిపై కేసులు నమోదు చేయాలని సమావేశం నిర్ణయించింది. పేదల ఆక్రమణలను తొలగించి వేరేచోట వారికి ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని అభిప్రాయపడింది. మరిన్ని నిర్ణయాలివీ..
► కంటోన్మెంట్ పరిధిలోని నాలాలపై ఆక్రమణలు అక్కడి పాలనావిభాగం సహకారంతో తొలగింపు
► ఆక్రమణల కేసులు పరిష్కరించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు. దీనిపై ఈ నెల 26న కేబినెట్ సమావేశంలో తీర్మానం

>
మరిన్ని వార్తలు