డెబిట్‌ కార్డు పేమెంట్లపై కేంద్రం ఊరట

15 Dec, 2017 18:32 IST|Sakshi

న్యూఢిల్లీ : నగదురహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు డిజిటల్‌ లావాదేవీలపై కేంద్ర కేబినెట్‌ పలు ప్రోత్సహాకాలను ప్రవేశపెడుతోంది. రూ.2000 వరకు జరిపే డిజిటల్‌ లావాదేవీలపై మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేటును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని, ఈ లావాదేవీలపై వినియోగదారులు ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ శుక్రవారం నిర్ణయించింది. ''అంతకముందు చెల్లించిన ఎండీఆర్‌లను ప్రభుత్వం తిరిగి చెల్లించాలని మేము నిర్ణయించాం. డెబిట్‌ కార్డు, యూపీఐ, భీమ్‌, ఆధార్‌ ఎనాబుల్‌ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. చిన్న డిజిటల్‌ వినియోగదారులకు ఇది చాలా పెద్ద ఊరట'' అని కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ అన్నారు. 

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కనీసం రెండేళ్ల వరకు రూ.2000 వరకు జరిపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదని పేర్కొన్నారు.  డెబిట్‌, క్రెడిట్‌ కార్డు సర్వీసులు అందించేందుకు గాను, బ్యాంకులు వసూలు చేసే రుసుం ఎండీఆర్‌. రూ.2000 కంటే తక్కువగా ఉన్న లావాదేవీలకు బ్యాంకులకు చెల్లించే ఎండీఆర్‌ విలువ 2018-19లో రూ.1,050 కోట్లగా అంచనావేస్తుండగా.. 2019-20లో రూ.1,462 కోట్లుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షల వరకున్న చిన్న వర్తకులకు విధించే ఎండీఆర్‌ ఛార్జీలు 0.40 శాతంగా నిర్ణయించారు. ఒకవేళ వర్తకుల వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలు దాటితే, ఎండీఆర్‌ ఛార్జీలు 0.90 శాతంగా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు