రూ.700కే జియో ఫోన్‌

16 Oct, 2017 11:51 IST|Sakshi

రూ.1500 రీఫండబుల్‌ సెక్యురిటీ డిపాజిట్‌తో రిలయన్స్‌ జియో తన స్మార్ట్‌ ఫీచర్‌ ఫోన్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. తొలి దశలో బుక్‌ అయిన 6 మిలియన్‌ యూనిట్లను కంపెనీ తన కస్టమర్ల చేతికి అందిస్తోంది. దశల వారీగా అందిస్తున్న ఈ ఫోన్‌పై ఇప్పటికే డెలివరీ లేటు అయిందంటూ ట్విట్టర్‌లో నిరాశవ్యక్తమవుతూ ఉంది. తాజాగా ఓ కస్టమర్‌ చేసిన ట్వీట్‌ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఫోన్‌ను పొందిన కొందరు ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌ ప్లాట్‌ఫామ్‌ ఓఎల్‌ఎక్స్‌లో రిజిస్ట్రర్‌ జియో నెంబర్లతో పాటు విక్రయానికి పెట్టినట్టు ట్వీట్‌ చేశాడు. తొలుత ఈ ఫోన్‌ డెలివరీ గ్రామీణ ప్రాంతాలకు అని, తర్వాత ఓఎల్‌ఎక్స్‌లోకి అని, ఎప్పటి నుంచో వేచిచూస్తున్న పట్టణ ప్రాంత ప్రజలు పూల్స్‌?? అంటూ ప్రశ్నించాడు. ఓఎల్‌ఎక్స్‌లో ఈ ఫోన్‌ ధర రూ.700 నుంచి రూ.2,499 మధ్యలో ఉందని తెలిసింది. పూర్తిగా బాక్స్‌ చేసిన ఉన్న ఫోన్‌నే విక్రయిస్తున్నారట. 

అసలు రిలయన్స్‌ జియో పాలసీల మేరకు జియో ఫోన్‌ నాన్‌-ట్రాన్సఫరేబుల్‌. ఈ ఫోన్‌ను పొందిన వారు దీన్ని విక్రయించడానికి, లీజ్‌కు ఇ‍వ్వడానికి, ట్రాన్సఫర్‌ చేయడానికి వంటి వాటికి అనుమతి ఉండదు. థర్డ్‌ పార్టీ నుంచి ఒకవేళ ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. తొలుత జియో సిమ్‌ విషయంలోనూ, తర్వాత రిటర్ను చేసే విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయట. ఒకరు రిజిస్టర్ చేసుకున్న జియోఫోన్‌ను మరొకరు పొందడం పెద్ద భద్రతా ప్రమాదంగా మారుతుందని, దీన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశముంటుందని కంపెనీనే ఈ ఫోన్‌ ట్రాన్సఫర్‌పై నిషేధం విధించింది. ఓఎల్‌ఎక్స్‌ కూడా తన ప్లాట్‌ఫామ్‌పై అమ్మే వస్తువులపై ఎక్కువ జాగురకత వహించాలని, అన్నింటికీ రీసేల్‌, రీసోల్డ్‌కు అవకాశమివ్వకూడదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతమైతే జియో ఫోన్‌ ప్రీబుకింగ్స్‌ లేనప్పటికీ, కంపెనీ ముందస్తు వచ్చిన డిమాండ్‌ను తట్టుకోవడానికే చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
 

మరిన్ని వార్తలు