పాతతరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు

19 Oct, 2017 03:56 IST|Sakshi

ఆదాయాలు, రుణాల్లో వృద్ధి అవకాశాలు

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నివేదిక

ఐదు బ్యాంకుల పట్ల సానుకూలత

ముంబై: దక్షిణాదికి చెందిన వెనుకటి తరం ప్రైవేటు బ్యాంకులకు మంచి రోజులు ముందున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంటోంది. ఆస్తుల నాణ్యత మెరుగు పడటంతో ఆదాయార్జన అవకాశాలు పెరిగాయని, కొన్నేళ్ల పాటు వరుసగా రుణాల్లో వృద్ధి లేకపోగా, అది మళ్లీ పుంజుకోనుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలియజేసింది. ఫెడరల్‌ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, సిటీ యూనియన్‌ బ్యాంకు, కరూర్‌ వైశ్యా బ్యాంకు తామున్న ప్రాంతాల్లో బలమైన స్థితి కారణంగా వేగంగా వృద్ధి చెందనున్నట్టు నివేదికలో పొందుపరించింది.

‘‘అత్యధిక ఆదాయ వృద్ధి అవకాశాలతోపాటు స్థిరమైన నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎం), నిలకడైన ఆస్తుల నాణ్యత, తగినంత నిధులు కలిగిన బ్యాంకులకే మా ప్రాధాన్యం. ఈ ఐదు బ్యాంకులు వచ్చే రెండేళ్ల కాలంలో రుణాల్లో 11–22%, ఆదాయాల్లో 12–25% మధ్యలో కాంపౌండెడ్‌ వార్షిక వృద్ధి రేటును సాధించగలవు’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఫెడరల్, సిటీ యూనియన్‌ బ్యాంకులను కొనుగోలు చేయవచ్చని, మిగిలిన వాటిని హోల్డ్‌ చేయవచ్చంటూ సిఫారసు చేసింది.

మరిన్ని వార్తలు