58% సంపద 1% సంపన్నుల వద్దే

17 Jan, 2017 10:37 IST|Sakshi
58% సంపద 1% సంపన్నుల వద్దే

ప్రపంచ సగటు కంటే ఎక్కువ
దేశంలో పెరిగిపోతున్న అసమానత్వం
70% మంది సంపదకు సమాన మొత్తం 57 మంది సొంతం
84 మంది కుబేరుల సంపద 248 బిలియన్‌ డాలర్లు
తొలి మూడు స్థానాల్లో ముకేశ్‌ అంబానీ, దిలీప్‌ సంఘ్వి, ప్రేమ్‌జీ
ఆక్స్‌ఫామ్‌ నివేదికలో వెల్లడి


దావోస్‌ (స్విట్జర్లాండ్‌): సంపద అసమానత్వం దేశంలో పెచ్చుమీరిపోతోంది. రోజులో రెండు పూటలా కడుపునిండా తినలేని పేదరికంతో దేశంలో సుమారు 30 శాతం మంది ఒకవైపు అల్లాడుతుంటే... మరోవైపు దేశ సంపదలో 58 శాతం కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే తిష్టవేసింది. ఈ అసమానత్వంలో ప్రపంచ సగటు రేటు 50 శాతాన్ని మన దేశం దాటేసింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు సందర్భంగా సంపన్నులు, ప్రముఖులు సమావేశం అవుతున్న తరుణంలో... ఈ వాస్తవాలను ఆక్స్‌ఫామ్‌ అనే హక్కుల గ్రూపు ‘యాన్‌ ఎకానమీ ఫర్‌ 99 పర్సెంట్‌’ పేరుతో సోమవారం విడుదల చేసింది.

ఇక సమగ్రాభివృద్ధి సూచీలోనూ అభివృద్ధి చెందుతున్న 79 దేశాలను తీసుకుని చూస్తే వాటిలో భారత్‌ది 60వ స్థానం. అంటే కింది నుంచి 19 స్థానాలపైన. ఇందులో మరింత నివ్వెరపరిచే వాస్తవం ఏమిటంటే పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనాల కంటే కూడా మనం కింద ఉండడం. చివరికి ప్రతిభతో పోటీ పడే విషయంలోనూ మన దేశం మెరుగైన స్థానంలో లేదు. 3 స్థానాలు దిగజారి సూచీలో భారత్‌ 92వ స్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక పేర్కొంది.

సంపద అసమానత్వం
దేశంలో మొత్తం సంపద 3.1 లక్షల కోట్ల డాలర్లు. ఇందులో కింది నుంచి 70 శాతం మంది జనాభా సంపద 216 బిలియన్‌ డాలర్లు. ఆశ్చర్యంగా దేశంలో 57 మంది బిలియనీర్ల సంపద కూడా ఇంచుమించుగా 216 బిలియన్‌ డాలర్లే.
దేశంలోని 84 మంది బిలియనీర్ల సమష్టి సంపద 248 బిలియన్‌ డాలర్లు. వీరిలో తొలి మూడు స్థానాల్లో ఉన్నవారు... 1.ముకేశ్‌ అంబానీ (19.3 బిలియన్‌ డాలర్లు) 2. సన్‌ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్‌సంఘ్వి (16.7బిలియన్‌ డాలర్లు) 3. విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ (15 బిలియన్‌ డాలర్లు).

ప్రపంచవ్యాప్తంగా...
ఈ ప్రపంచ పేదల్లో 50 శాతం మంది దగ్గరున్న సంపదకు సమాన స్థాయిలో 8 మంది బిలియనీర్లు కలిగి ఉన్నారు. ప్రపంచ మొత్తం సంపద 255.7 ట్రిలియన్‌ డాలర్లు. ఇందులో 6.5 ట్రిలియన్‌ డాలర్లు బిలియనీర్ల సంపదే. 1. బిల్‌గేట్స్‌ (75 బిలియన్‌ డాలర్లు) 2. అమన్సియో ఒర్టెగా (67 బిలియన్‌ డాలర్లు) 3. వారెన్‌ బఫెట్‌ (60.8 బిలియన్‌ డాలర్లు).
2015 నుంచి సంపన్నులు ఒక్క శాతం మంది మిగతా ప్రపంచ జనాభాకు మించిన సంపదను కలిగి ఉండడం జీర్ణించుకోలేని వాస్తవం. వచ్చే 20 ఏళ్లలో 500 మంది 2.1 ట్రిలియన్‌ డాలర్ల సంపదను తమ వారసులకు అప్పగించనున్నారని... ఇది 130 కోట్ల జనాభా కలిగిన భారత జీడీపీ కంటే పెద్ద మొత్తం అని ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది. ఈ దృష్ట్యా వారసత్వ పన్నును విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం కలిగించే మానవత్వంతో కూడిన ఆర్థిక రంగాన్ని నిర్మించాల్సిన సమయమిదే. అంతేకానీ ఏ కొద్ది మంది కోసమో కాదు అని నివేదికలో ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది.
భారత్, చైనా, ఇండోనేషియా, లావోస్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ధనికులైన 10 శాతం మంది ప్రజలు తమ ఆదాయ వాటాను గత రెండు దశాబ్దాల్లో 15 శాతం పెంచుకున్నారు. అదే సమయంలో అత్యంత పేదలైన 10 శాతం మంది ప్రజలు 15 శాతం సంపదను కోల్పోయారు.

వెట్టి చాకిరీ.. కార్పొరేట్ల లాభార్జన
దేశంలో బాలకార్మికులు, బలవంతపు వెట్టిచాకిరీ జరుగుతున్న తీరునూ ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రస్తావించింది. ప్రపంచంలో పెద్దవైన వస్త్ర కంపెనీలకు భారత్‌లోని కాటన్‌ స్పిన్నింగ్‌ మిల్లులు సరుకులను అందిస్తున్నాయి. ఇవి బాలికలతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయి. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ గణాంకాల ప్రకారం దేశంలో 58 లోల మంది బాలకార్మికులు ఉన్నారని నివేదిక పేర్కొంది.

సమగ్రాభివృద్ధిలో మన నంబర్‌ 60
పొరుగు దేశాల కంటే వెనుకంజ

సమగ్రాభివృద్ధి సూచీలో మన దేశం చెప్పుకోతగ్గ స్థితిలో లేదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 79 ఆర్థిక వ్యవస్థల్లో... పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్‌ల కంటే దిగువన 60వ స్థానంలో భారత్‌ ఉందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ‘సమగ్ర వృద్ధి, అభివృద్ధి నివేదిక – 2017’ను విడుదల చేసింది. చాలా దేశాలు అసమానత్వాన్ని తగ్గించుకునేందుకు వీలుగా ఆర్థిక వృద్ధికి వచ్చిన అవకాశాలను జార విడుచుకుంటున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. దశాబ్దాలుగా విధాన కర్తలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా, ప్రమాణాలను తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి ఉందని సూచించింది. సమగ్రాభివృద్ధి సూచీలో లిత్వేనియా ప్రథమ స్థానంలో ఉంది. అజర్‌బైజాన్, హంగరీ, పోలండ్, రొమేనియా, ఉరుగ్వే, లాత్వియా, పనామా, కోస్టారికా, చిలే వరుసగా పది స్థానాలను ఆక్రమించాయి. చైనా (15), నేపాల్‌ (27), బంగ్లాదేశ్‌ (36), పాకిస్తాన్‌ (52) మనకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి.

భారత్‌లో పురుషులకే వేతనాలు ఎక్కువ..
భారత్‌లో మాత్రం వేతనాల విషయంలో లింగ వివక్ష ఎక్కువే ఉందని ఆక్స్‌ఫామ్‌ అధ్యయనం పేర్కొంది. ఒకేరకమైన ఉద్యోగాల్లో పురుషులు మహిళల కంటే 30% కంటే అదనంగా వేతనాలు అందుకుంటున్నారని తెలిపింది. 60% మంది మహిళలు తక్కువ వేతనాలు అందుకుంటున్నవారే. కేవలం 15% మంది మహిళలు మాత్రం అధిక వేతనాలు తీసుకోగలుగుతున్నారు. అధిక వేతనాల స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం అంతగా లేకపోవడమే కాకుండా అనుభవానికి తగ్గట్టు వేతనాలు ఇచ్చే విషయాల్లో లింగ తారతమ్యత ఉన్నట్టు ఈ వాస్తవాలు తెలియజేస్తున్నాయని ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది. దేశంలో అత్యున్నత సమాచార కంపెనీ సీఈవో అందుకుంటున్న వేతనం అదే కంపెనీలో సాధారణ ఉద్యోగి వేతనం కంటే 416 రెట్లు ఎక్కువ.

సర్కారు ఇవి చేస్తే పేదరికం ఉండదు..
పేదరికానికి చరమగీతం పలకడానికి ఆక్స్‌ఫామ్‌ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ‘‘సంపదపై ఎక్కువగా దృష్టి పెట్టడం ఆపాలి. వారసత్వ పన్నుతోపాటు, మొత్తం పన్ను వసూళ్లలో తక్కువ వాటా ఉన్న సంపద పన్నును సైతం పెంచాలి. పన్ను మినహాయింపులను ఎత్తివేయాలి. కార్పొరేట్‌ పన్నును తగ్గించడాన్ని మానుకోవాలి. షేర్‌ హోల్డర్ల ప్రయోజనాల కోసం పనిచేసేవి కాకుండా తమ ఉద్యోగులు, సమాజ హితం కోసం పనిచేసే కంపెనీలను ప్రోత్సహించాలి. కార్పొరేట్లు, సంపన్నులైన వ్యక్తులు పన్ను ఎగవేతలను అరికట్టాలి. ఆరోగ్యం, విద్యపై పెట్టుబడుల కోసం తగిన నిధులు రాబట్టుకోవాలి. ఆరోగ్యంపై జీడీపీలో కేటాయింపులను 1% నుంచి 3%కి పెంచాలి. విద్యపై కేటాయింపులను 3 నుంచి 6% చేయాలి’’ అని సూచించింది.

ఆటోమేషన్‌తో ఉద్యోగాలకు ఎసరు..
దేశంలో ఆటోమేషన్‌ కారణంగా పావుశాతం కంటే ఎక్కువ కంపెనీలు  ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనున్నాయని... ప్రపంచ వ్యాప్తంగానూ ఆటోమేషన్‌ చాలా కంపెనీలను ప్రభావితం చేస్తుందని హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ మ్యాన్‌పవర్‌గ్రూపు దావోస్‌లో విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. కొత్త టెక్నాలజీల వల్ల కంపెనీలకు, ఉద్యోగులకు ప్రత్యేక నైపుణ్యాల అవసరం ఏర్పడిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల్లో 18వేల కంపెనీలపై సర్వే చేయగా... 90% కంటే ఎక్కువే డిజిటైజేషన్‌వల్ల వచ్చే రెండేళ్లలో తమ కంపెనీలపై ప్రభావం పడతాయని తెలిపాయి.

మరిన్ని వార్తలు