రీపేమెంటూ పసిడి రూపంలోనే కావాలి

24 Mar, 2016 01:32 IST|Sakshi
రీపేమెంటూ పసిడి రూపంలోనే కావాలి

పసిడి డిపాజిట్ పథకంపై టీటీడీ అభిప్రాయం

 

న్యూఢిల్లీ: దీర్ఘకాలానికి తాము గోల్డ్ డిపాజిట్ పథకం కింద దీర్ఘకాలానికి తాము జమ చేసే పసిడిని బ్యాంకులు తిరిగి అదే రూపంలో ఇవ్వాలని, నగదు రూపంలో తమకొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంటోంది. ఇందుకోసం నిబంధనల్లో తగు మార్పులు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. మధ్యకాలిక, దీర్ఘకాలిక బంగారం డిపాజిట్లపై అసలు, వడ్డీని పసిడి రూపంలోనే ఇచ్చేలా సంబంధిత స్కీములో సవరణలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి రాసినట్లు టీటీడీ ఈడీ డి. సాంబశివరావు తెలిపారు. ఇలా మార్పులు చేస్తే దేశవ్యాప్తంగా మిగతా ఆలయాలు కూడా గోల్డ్ డిపాజిట్ పథకంపై ఆసక్తి చూపొచ్చని పేర్కొన్నారు.

బంగారం డిపాజిట్ పథకం విజయవంతం కావాలంటే దేవాలయాలు కూడా పాలుపంచుకోవాల్సి ఉంది. అయితే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో డిపాజిట్ పథకం కింద బంగారాన్ని వదులుకుని నగదు రూపంలో తీసుకునేందుకు ఆలయాలు ఇష్టపడటం లేదు. ఇటీవలే 44 కేజీలు డిపాజిట్ చేస్తామని ప్రకటించిన ముంబై సిద్ధి వినాయక ఆలయం వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం టీటీడీ వద్ద దాదాపు 7 టన్నుల పసిడి ఉన్నట్లు అంచనా. గత నెల 1.3 టన్నుల బంగారాన్ని మూడేళ్ల కాల వ్యవధికి 1.75 శాతం వడ్డీ రేటుకి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో  డిపాజిట్ చేసినట్లు సాంబశివరావు తెలిపారు. మరో పక్షం రోజుల్లో 1.25 శాతం వడ్డీ రేటుకి 1.4 టన్నుల బంగారాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు