అన్ని లావాదేవీలకు ఒకే క్యూఆర్ కోడ్

21 Jan, 2020 17:02 IST|Sakshi

రోజురోజుకు డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్‌పే, పేటిఎం వంటి క్యూఆర్‌ కోడ్‌లు కనిపిస్తుంటాయి. ఈ తరహాలోనే పేటీఎం ఇటీవల దేశవ్యాప్తంగా ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్ కోడ్‌ను పేటీఎం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక వ్యాపారులు కేవలం వ్యాలెట్‌, యూపీఐ ద్వారా మాత్రమే కాకుండా రూపే కార్డుల నుంచి చెల్లింపులను అందుకునే వీలుంది. అంతేకాదు, ఇలాంటి చెల్లింపులకు ఎండీఆర్‌ చార్జీలు కూడా విధించలేదు. 

ఈ క్యూఆర్‌ కోడ్‌ వ్యాపారుల కోసం పేటీయం రూపొందించిన 'పేటీయం ఫర్‌ బిజినెస్‌ యాప్‌' ద్వారా వస్తుంది. దీని ద్వారా వ్యాపారులు ఎన్ని విధాలుగా అయినా అన్‌లిమిటెడ్‌ పేమెంట్లను ఆమోదించవచ్చు. కేవలం చెల్లింపులు మాత్రమే కాకుండా వ్యాపారులతో మరింత అనుబంధం కోసం మర్చంట్ సొల్యూషన్స్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచనలో కూడా పేటీఎం ఉన్నట్లు సమాచారం. ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ సెటిల్‌మెంట్‌, రియల్‌ టైమ్‌ నోటిఫికేషన్‌ వంటి ఫీచర్లు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి.

మొదట వ్యాలెట్‌గానే ఉన్నప్పటికీ క్రమంగా పేటీయంకు యూపీఐని కూడా జత చేశామని, నేడు రూపే కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరిపే ఫీచర్‌ను జోడించినట్లు వ్యవస్థాపకులు వెల్లడించారు. 2019లో 900 కోట్ల క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత చెల్లింపులు జరగ్గా అందులో 500 కోట్ల చెల్లింపులు పేటీయం ద్వారానే జరిపినట్టు అధికారంగా తెలిపారు. ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లో మొత్తం 50కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ ఫీచర్‌ పేటీయం ప్రత్యర్థి సంస్థలు గూగుల్‌ పే, ఫోన్‌ పేల్లో అందుబాటులో లేదు. పేటీఎం ఆల్‌-ఇన్‌-వన్‌ క్యూఆర్ కోడ్‌ స్టిక్కర్లను కాలిక్యులేటర్, పవర్ బ్యాంక్, క్లాక్, పెన్ స్టాండ్స్, రేడియో లాంటివాటిపై అందిస్తోంది. వ్యాపారి పేర్లు, లోగోలు, ఫోటోలతో కూడా క్యూఆర్ కోడ్ ఆర్డర్ చేయొచ్చు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు