మోదీ పర్యటన దిగ్విజయం: కార్పొరేట్లు

20 Nov, 2014 01:11 IST|Sakshi

 మెల్‌బోర్న్: ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఆస్ట్రేలియా పర్యటనపై భారత వాణిజ్యవేత్తల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి ఊపునిస్తుందని, ద్వైపాక్షిక వాణిజ్యం జోరు పెరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటన విజయవంతమైందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్తమ స్థాయికి చేరాయని ఇన్ఫోసిస్ చైర్మన్ విశాల్ సిక్కా పేర్కొన్నారు.  

ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా విజయంతమైతే, భారత్‌కు ముడి పదార్ధాలు భారీ స్థాయిలో అవసరమవుతాయని, దీంతో ఆస్ట్రేలియాతో అపార వ్యాపారవకాశాలు అందుబాటులోకి వస్తాయని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా వివరించారు. భారత్‌కు, ఆస్ట్రేలియాకు చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయని, గత 28 ఏళ్లలో ఒక్క భారత ప్రధాని కూడా ఆస్ట్రేలియాను సందర్శించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఉద్యోగుల అలసత్వం వల్ల తమ వ్యాపారాలకు సంబంధించి చాలా నిర్ణయాలు, ఆమోదాలు పెండింగ్‌లో ఉండేవని పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం వల్ల సత్వర నిర్ణయాలు వెలువడుతున్నాయని, అడ్డంకులు తొలగిపోతున్నాయని, వృద్ధిపై విశ్వాసం పెరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు