కార్పొరేట్లను తిట్టడం ఫ్యాషనైపోయింది.. 

25 Oct, 2018 02:01 IST|Sakshi

ఇది ఆమోదయోగ్యం కాదు

వారెంతో సమాజ సేవ కూడా చేస్తున్నారు

ఐటీ నిపుణులతో చర్చాగోష్టిలో మోదీ వ్యాఖ్యలు  

న్యూఢిల్లీ: కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలను ప్రదాని నరేంద్ర మోదీ మరోసారి సమర్ధించారు. కార్పొరేట్లు వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేస్తున్నప్పటికీ.. వారిని తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని మోదీ ఆక్షేపించారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఐటీ నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలతో బుధవారం చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఐటీ, కార్పొరేట్‌ దిగ్గజాలు అత్యుత్తమంగా సామాజిక సేవ చేస్తుండటం, తమ ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండటం మనం చూస్తున్నాం. ఎందుకో తెలియదు కానీ మన దేశంలో వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను విమర్శిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదో ఫ్యాషన్‌గా మారింది. ఇది నాకు ఆమోదయోగ్యమైన విషయం కాదు’ అని మోదీ పేర్కొన్నారు. కార్పొరేట్లను మోదీ సమర్ధించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కూడా కీలకపాత్ర పోషించారని, వారితో కలిసి కనిపించడానికి తాను భయపడబోనని జూలైలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.   

పన్నులు కట్టడమే కాదు..  సమాజ సేవా చేయాలి.. 
కేంద్రం ప్రజా ధనాన్ని సద్వినియోగం చేస్తోందన్న నమ్మకం కలగడం వల్లే తమ ప్రభుత్వ హయాంలో పన్నులు సక్రమంగా చెల్లించే వారి సంఖ్య పెరిగిందన్నారు. అయితే, సామాజిక బాధ్యత కింద నిజాయితీగా పన్నులు చెల్లించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పౌరు లు తమ వంతుగా మరికాస్త పాటుపడాలని సూచించారు. ‘పన్నులు చెల్లించడమన్నది సహజసిద్ధమైన ప్రకృతి. కట్టకపోవడమన్నది వికృతి. కానీ పన్నులు సక్రమంగా కట్టడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మరికాస్త పాటుపడటమనేది సంస్కృతి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు టెక్నాలజీపరమైన పరిష్కారమార్గాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని ఐటీ నిపుణులకు ప్రధాని సూచించారు. కాగా కొత్తగా ప్రారంభించిన సెల్ఫ్‌4సొసైటీకి ఐటీ దిగ్గజ కంపెనీలు మద్దతు తెలిపాయి.   
 

మరిన్ని వార్తలు