రూ.200 నోట్లు వచ్చేస్తున్నాయి..

29 Jun, 2017 12:41 IST|Sakshi


నోట్ల రద్దుతో ఏర్పడిన చిన్న నోట్ల కష్టాలకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా చెక్‌ పెట్టబోతుంది. చిన్ననోట్ల కోసం అల్లాడిపోతున్న ప్రజలకు భారతీయ రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది. రూ.200 నోట్ల ముద్రణను ప్రారంభించినట్టు, వీటి ముద్రణ కూడా జోరుగా సాగుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రభుత్వానికి చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఒకదానిలో కొన్ని వారాల కిందటే వీటి ముద్రణ ప్రారంభించినట్టు పేర్కొన్నాయి. రోజువారీ కార్యకలాపాలకు 200 నోట్ల ఎంతో సహకరించనున్నాయని, ఆపరేషన్లను సలుభతరం చేయనున్నాయని ఎస్బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ సౌమ్య కాంతి ఘోష్‌ తెలిపారు. నవంబర్‌ 8న పెద్ద నోట్లను అకస్మాత్తుగా పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే.  
 
500, 1000 రూపాయి నోట్లను రద్దుచేయడంతో, కొత్తగా 2000 కరెన్సీ నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అనంతరం 500రూపాయి నోటును కూడా తీసుకొచ్చింది. కానీ ఈ నోట్లే విపరీతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో చిల్లర సమస్య ఏర్పడింది. దీంతో చిల్లర దొరకక ప్రజలు అవస్థలు పడ్డారు. పెద్దనోట్లు ఉన్నప్పటికీ, ఖర్చు పెట్టలేని స్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం ఈ అవస్థలకు చెక్‌ పెట్టడానికి 200 రూపాయి నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అడ్వాన్స్డ్‌ సెక్యురిటీ ఫీచర్లతో వీటిని తీసుకొస్తోందని, అధికారులు ఈ నోటు విషయంలో అదనపు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. నాణ్యత, భద్రతా ప్రమాణాలను మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో వివిధ దశల్లో తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది.