మిగిలేవి పదో.. పన్నెండో!

18 Jul, 2017 00:33 IST|Sakshi
మిగిలేవి పదో.. పన్నెండో!

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరిన్ని విలీనాలు
3–4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దే ప్రయత్నాలు
ఆంధ్రా బ్యాంకు స్వతంత్రంగానే కొనసాగే అవకాశాలు  


న్యూఢిల్లీ: మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ద్వారా మొత్తం మీద 3–4 అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను తీర్చిదిద్దడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 21 ఉండగా.. విలీనాలతో ఈ సంఖ్య 10–12కి తగ్గనుంది. ఎస్‌బీఐ స్థాయిలో మరో 3–4 బ్యాంకులను తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఆంధ్రా బ్యాంకు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకుతో పాటు మరికొన్ని మధ్యస్థాయి బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగే అవకాశముందని వివరించాయి. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనంతో ఊపు మీద ఉన్న కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మొండి బకాయిలు అదుపులోకి వస్తే మరో విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని యోచిస్తోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సాలిడేషన్‌పై మరింతగా కసరత్తు జరుగుతోందంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ సి.రంగరాజన్‌ సైతం వ్యవస్థలో కొన్ని పెద్ద బ్యాంకులు, కొన్ని చిన్నవి, ఇంకొన్ని స్థానిక బ్యాంకులు మొదలైనవి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఎస్‌బీహెచ్‌ సహా అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును ఈ ఏడాది ఏప్రిల్‌ 1న విలీనం చేశారు. దీంతో ఎస్‌బీఐ ప్రపంచంలోనే టాప్‌ 50 బ్యాంకుల జాబితాలో చేరింది. ఈ విలీనంతో ఎస్‌బీఐ ఖాతాదారుల సంఖ్య 37 కోట్లకు, శాఖలు 24,000కు, ఏటీఎంల సంఖ్య 59,000కు చేరింది.

పీఎన్‌బీ తదితర బ్యాంకుల్లో విలీనం: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(బీఓఐ) వంటి పెద్ద పీఎస్‌బీల్లో కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేసేందుకు ఆస్కారముందని మరో అధికారి తెలిపారు. ప్రాంతీయంగా సమతుల్యత, భౌగోళికంగా విస్తరణ, ఆర్థిక భారం, సులభతరమైన మానవ వనరుల బదలాయింపు ప్రక్రియ మొదలైన అంశాలన్నీ విలీనాలపై తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరీ బలహీనమైన బ్యాంకును పటిష్టమైన బ్యాంకులో విలీనం చేస్తే పెద్ద బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి.. అటువంటి ప్రతిపాదనలేమీ ఉండబోవని సంబంధిత అధికారి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు