అసమానతలను  నిర్లక్ష్యం చేస్తే అనర్థమే 

13 Mar, 2019 00:06 IST|Sakshi

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌

ముంబై: ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల్లో పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్లక్ష్యం చేస్తే అనర్థాలు తప్పవని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీ కూడా అసమానతలకు కారణంగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఓవైపు ఆటోమేషన్‌ మూలంగా కొన్ని ఉద్యోగాల్లో కోత పడుతుండగా, మరోవైపు ఏదైనా ఎక్కడైనా ఉత్పత్తిచేయడం సాధ్యపడుతుండటంతో అప్పటిదాకా వాటి తయారీపైనే ఆధారపడిన సామాజిక వర్గాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ‘ఆయా వర్గాలు తమ ఆర్థిక ఆసరాను కోల్పోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. కొన్నిసార్లు జనాకర్షక కార్య క్రమాలతో రాజకీయనాయకులు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తున్నారు.

ఇలా సామాజిక అసమానతల పరిష్కారానికి విరుగుడుగా జనాకర్షక విధానాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటం పెట్టుబడిదారీ వ్యవస్థకు ముప్పుగా పరిణమించనుంది’ అని పేర్కొన్నారు.  దేశ సమైక్యత, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ, సామాజిక.. ఆర్థిక అభివృద్ధి అంశాల్లో అందించిన సేవలకు గాను యశ్వంత్‌రావ్‌ చవాన్‌ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వీడియో లింక్‌ ద్వారా రాజన్‌ ఈ విషయాలు పేర్కొన్నారు. ఆయా వర్గాల సమస్యల పరిష్కారం ద్వారా అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నం చేయొచ్చన్నారు. వెనకబడిన వర్గాలు టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు చేపట్టే చర్యలపై దృష్టి సారించాలన్నారు.    

మరిన్ని వార్తలు