తొలిసారి షేర్లు కొంటున్నారా?

2 Nov, 2015 01:25 IST|Sakshi
తొలిసారి షేర్లు కొంటున్నారా?

ఒక పక్కేమో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. డిపాజిట్లపై వచ్చే ఆదాయం తగ్గిపోతోంది.  ఏంచేయాలి? ఇలా ఆలోచించేవారికిపుడు గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్  మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు స్టాక్  మార్కెట్లోకి ప్రవేశించని వారు కూడా కొత్తగా డీమ్యాట్ ఖాతాలు తెరిచే పనిలో పడుతు న్నారు. అయితే ఇలా తొలిసారిగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు మరో లాభం కూడా ఉంది. అది... పన్ను ప్రయోజనం. రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం (ఆర్‌జీఈఎస్‌ఎస్) ద్వారా వారు పన్ను లాభాలను కూడా అందుకోవచ్చు.
 
రాజీవ్‌గాంధీ ఈక్విటీ స్కీమ్ కింద పన్ను ప్రయోజనాలు
* వార్షికాదాయం రూ.12 లక్షల లోపు ఉంటేనే వర్తింపు
* మూడేళ్ల పాటు వరుసగా పన్ను లాభం పొందే అవకాశం
* ఎంపిక చేసిన షేర్లు, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే...
 
ఆర్‌జీఈఎస్‌ఎస్ అంటే...

స్టాక్ మార్కెట్లో  దేశీయ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్‌ను (ఆర్‌జీఈఎస్‌ఎస్) ప్రవేశపెట్టింది. తొలిసారిగా ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేవారికి పన్ను ప్రయోజనం దీని ఉద్దేశం. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 80 సీసీజీనీ ప్రత్యేకంగా చేర్చారు. అంటే ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల పన్ను ప్రయోజనానికి అదనం. ఈ పథకం కింద ఎంపిక చేసిన షేర్లు, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.  

ఇలా గరిష్టంగా రూ.50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.  ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో సగాన్ని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే వెసులుబాటు ఉంది. ఉదాహరణకు రూ. 50,000 ఇన్వెస్ట్ చేస్తే అందులో సగం రూ. 25,000 మీ ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. దీనివల్ల కనిష్టంగా రూ.2,500 నుంచి గరిష్టంగా రూ.7,500 వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఇలా వరుసగా మూడేళ్లు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను లాభాలను పొందవచ్చు. వార్షికాదాయం రూ. 12 లక్షలు లోపు ఉండాలి. ఒకవేళ మూడేళ్ల మధ్యలో మీ వార్షికాదాయం రూ.12 లక్షలు దాటితే ఆ ఏడాది నుంచి ఈ ప్రయోజనాలు వర్తించవు.
 
ఆర్‌జీఈఎస్‌ఎస్ వర్తించే కొన్ని ఈటీఎఫ్‌లు

* బిర్లా సన్‌లైఫ్ నిఫ్టీ ఈటీఎఫ్
* గోల్డ్‌మన్ బ్యాంకింగ్ ఇండెక్స్ ఈటీఎఫ్
* గోల్డ్‌మన్ నిఫ్టీ ఈటీఎఫ్
* గోల్డ్‌మన్ నిఫ్టీ జూనియర్
* గోల్డ్‌మన్ ఎస్‌అండ్‌పీ సీఎన్‌ఎక్స్ నిఫ్టీ
* ఐఐఎఫ్‌ఎల్ నిఫ్టీ ఈటీఎఫ్
* కోటక్ నిఫ్టీ ఈటీఎఫ్
* మోతీలాల్ ఎం50 ఈటీఎఫ్
* క్వాంటమ్ ఇండెక్స్ ఫండ్
* రెలిగేర్ నిఫ్టీ ఈటీఎఫ్
 
ఆర్‌జీఈఎస్‌ఎస్ ఫండ్స్

* బిర్లాసన్‌లైఫ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్
* బిర్లాసన్‌లైఫ్ ఆర్‌జీఈఎస్‌ఎస్ ఫండ్
* డీఎస్‌పీ బ్లాక్ రాక్ ఆర్‌జీఈఎస్‌ఎస్
* హెచ్‌డీఎఫ్‌సీ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్
* హెచ్‌డీఎఫ్‌సీ ఆర్‌జీఈఎస్‌ఎస్
* ఐసీఐసీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ సిరీస్
* ఎల్‌ఐసీ నోమూరా ఆర్‌జీఈఎస్‌ఎస్ సిరీస్1
* యూటీఐ రాజీవ్‌గాంధీ ఈక్విటీ స్కీం
* రిలయన్స్ సీఎన్‌ఎక్స్ 100
 
ఆర్‌జీఈఎస్‌ఎస్ వర్తించే పీఎస్‌యూ షేర్లు..
మహారత్న
కోల్ ఇండియా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, సెయిల్
 
నవరత్న
భారత్ ఎలక్ట్రానిక్స్, బీహెచ్‌ఈఎల్, బీపీసీఎల్, ఎంటీఎన్‌ఎల్, నాల్కో, ఎన్‌ఎండీసీ, నైవేలీ లిగ్నేట్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, షిప్పింగ్ కార్పొరేషన్.
 
వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలి
మీకు నచ్చిన కంపెనీ షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈ పన్ను ప్రయోజనాలు లభించవు. తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి రిస్క్ తక్కువగా ఉండే అతిపెద్ద కంపెనీల షేర్లు కొంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్‌జీఈఎస్‌ఎస్‌కు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కేవలం బీఎస్‌ఈ 100 , ఎన్‌ఎస్‌ఈ 100 ఇండెక్స్‌లో ఉన్న కంపెనీ షేర్లు లేదా ఈటీఎఫ్‌లు, ఆర్‌జీఈఎస్‌ఎస్ పరిధిలోకి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వరంగ మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చు. లేకపోతే ప్రభుత్వ వాటా 51 శాతంకన్నా తక్కువ కాకుండా,  రూ.4,000 కోట్లపైన వ్యాపార పరిమాణం ఉన్న కంపెనీలు జారీ చేసే పబ్లిక్ ఇష్యూల్లో ఇన్వెస్ట్ చేసినా ఆర్‌జీఈఎస్‌ఎస్ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
 
నిబంధనలు ఏమిటి?
ఇంతవరకు ఎటువంటి స్టాక్ మార్కెట్ లావాదేవీలూ నిర్వహించని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే డీమ్యాట్ ఖాతా ఉండాలి. గతంలో ఎప్పుడో డీమ్యాట్ అకౌంట్ తెరిచినా.. అందులో ఇప్పటి వరకు ఎటువంటి లావాదేవీలు జరపకుండా ఉండాలి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, షేర్లను కేవలం డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 
లాకిన్ పీరియడ్ ఉందా?
ఆర్‌జీఈఎస్‌ఎస్ పథకం కింద కొనుగోలు చేసిన షేర్లను మూడేళ్ల పాటు విక్రయించకూడదు. మూడేళ్ల కాలాన్ని లాకిన్ పీరియడ్‌గా పరిగణిస్తారు. అయితే ఇన్వెస్ట్ చేసిన ఏడాది తర్వాత నుంచి ఈ లాకిన్ ిపీరియడ్‌లో కొంత వెసులుబాటు కల్పించారు. రెండో ఏడాది నుంచి పన్ను మినహాయింపు పొందిన విలువకు సమాన మొత్తంలో షేర్లను ఉంచి, మిగిలిన యూనిట్లు లేదా షేర్లను విక్రయించవచ్చు. ఈ నిబంధన పాటించడంలో విఫలమైతే మీకు లభించిన పన్ను ప్రయోజనాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

మరిన్ని వార్తలు