వాస్తవాలకు దూరంగా రేటింగ్‌ ఏజెన్సీలు

6 Feb, 2017 02:49 IST|Sakshi
వాస్తవాలకు దూరంగా రేటింగ్‌ ఏజెన్సీలు

సంస్కరణలను పరిగణనలోకి తీసుకోలేదు
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌
భారత్‌ విషయంలో పునరాలోచించుకోవాలని సూచన


న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీల తీరును మరోసారి కేంద్రంలోని మరో ముఖ్య అధికారి తప్పుబట్టారు. దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగు పడినా భారతదేశ సౌర్వభౌమ రేటింగ్‌ను పెంచకుండా అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు అనుసరిస్తున్న ధోరణిపై ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంతదాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రేటింగ్‌ ఏజెన్సీలు దేశ వాస్తవిక పరిస్థితులకు ఎన్నో అడుగుల దూరంలోనే ఉండిపోయాయని ఆయన విమర్శించారు. ఏవో కొన్ని అంశాలను అవి విస్మరిస్తున్నాయని, దీనికి రేటింగ్‌ ఏజెన్సీలే తగిన వివరణ ఇవ్వగలవని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు దాస్‌ ఇంటర్వూ్య ఇచ్చారు. ‘‘గతేడాది అక్టోబర్‌లో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో కలసి మేము వెళ్లాం. ఆ సమయంలో కొంత మంది ఇన్వెస్టర్లతో చర్చించగా రేటింగ్‌ ఏజెన్సీలు భారత రేటింగ్‌ను పెంచకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు’’ అని దాస్‌ వివరించారు.

చాలా ఏళ్లుగా మార్పు లేదు...
భారత రేటింగ్‌ను రేటింగ్‌ ఏజెన్సీలు చివరిసారిగా దశాబ్దం క్రితం అప్‌గ్రేడ్‌ చేశాయి. ఫిచ్‌ భారత సౌర్వభౌమ రేటింగ్‌ను 2006లో బీబీబీకి పెంచగా, ఎస్‌అండ్‌పీ 2007లో ఈ పని చేసింది. ‘‘భారత రేటింగ్‌ను చివరిగా కొన్నేళ్ల క్రితం రేటింగ్‌ ఏజెన్సీలు పెంచాయి. గత రెండున్నరేళ్లలో దేశంలో జరిగిన సంస్కరణల ట్రాక్‌ రికార్డును చూడండి. భారత్‌ చేపట్టిన సంస్కరణల చర్యలను ఓ జాబితాగా తీసుకుని వాటిని గత రెండున్నరేళ్లలో ఏ ఇతర దేశం సంస్కరణల ట్రాక్‌ రికార్డుతోనయినా పోల్చి చూడండి. మా జీడీపీని చూడండి. ఇతర దేశాల జీడీపీతో దాన్ని పోల్చండి. స్థూల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటును కూడా ఇతర దేశాలతో పోల్చి చూడండి. నిజానికి రేటింగ్‌ ఏజెన్సీలు కొన్ని అంశాలను విస్మరిస్తున్నాయని అనుకుంటున్నాను. అవేంటన్నది రేటింగ్‌ ఏజెన్సీలే చెప్పగలవు’’ అని శక్తికాంత దాస్‌ అన్నారు. జీఎస్టీ, దివాలా చట్టాలకు ఆమోదం లభించినా రేటింగ్‌ ఏజెన్సీలు వాటికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం కూడా రేటింగ్‌ ఏజెన్సీల తీరును కొన్ని రోజుల క్రితం ఎండగట్టిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు