ఫస్ట్‌క్రైలో సాఫ్ట్‌బ్యాంక్‌ వాటాల విక్రయం

26 Dec, 2023 05:28 IST|Sakshi

310 మిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్ల అమ్మకం

న్యూఢిల్లీ: త్వరలో ఐపీవోకి రానున్న రిటైల్‌ సంస్థ ఫస్ట్‌క్రైలో జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ 310 మిలియన్‌ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించింది. రెండు విడతల్లో షేర్లను విక్రయించగా, కొందరు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్స్‌తో ఫస్ట్‌క్రై వేల్యుయేషన్‌ను 3.5–3.75 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి.

900 మిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫస్ట్‌క్రైలో  సాఫ్ట్‌బ్యాంక్‌ గతంలో 400 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. తాజా విక్రయానంతరం కంపెనీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు ఇంకా 800–900 మిలియన్‌ డాలర్ల విలువ చేసే వాటాలు ఉన్నాయి. వీటిని తర్వాత విక్రయించే యోచనలో ఉంది. మొత్తం మీద ఫస్ట్‌క్రైలో పెట్టుబడుల ద్వారా 1.3 బిలియన్‌ డాలర్లు ఆర్జించడంపై సాఫ్ట్‌బ్యాంక్‌ దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

>
మరిన్ని వార్తలు