ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 36 శాతం అప్‌

24 Oct, 2018 00:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 36 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.151 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.205 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం బాగా  పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని వివరించింది. అయితే కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల లాభం తగ్గిందని వివరించింది. నిర్వహణ లాభం 48 శాతం వృద్ధితో రూ.449 కోట్లకు పెరిగిందని, కీలకమైన ఫీజు ఆదాయం 60 శాతం వృద్ధితో రూ.325 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్‌...
నికర వడ్డీ ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.593 కోట్లకు, ఇతర ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.333 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్‌ 3.74 శాతం నుంచి 4.08 శాతానికి పెరిగిందని వెల్లడించింది. రుణ నాణ్యత ఒకింత మెరుగుపడిందని వివరించింది.

గత క్యూ2లో 1.44 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 1.40 శాతానికి, నికర మొండి బకాయిలు 0.78 శాతం నుంచి 0.74 శాతానికి తగ్గాయని తెలిపింది.  కేటాయింపులు 87 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగాయని పేర్కొంది.  బీఎస్‌ఈలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.465 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి, రూ.439ను తాకింది. 

మరిన్ని వార్తలు