జీఎస్టీ రేట్లు : ఆమ్‌ ఆద్మీకి మరో గుడ్‌న్యూస్‌ 

19 Jul, 2018 16:36 IST|Sakshi
మరో 30 నుంచి 40 వస్తువులపై తగ్గనున్న పన్ను రేట్లు

న్యూఢిల్లీ : సామాన్యులకు(ఆమ్‌ ఆద్మీ) కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతుంది. మరికొన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించేందుకు సిద్దమవుతోంది. శనివారం జరుగబోయే తదుపరి సమావేశంలో జీఎస్టీ విధానంలో పలు మార్పు చేసి, 30 నుంచి 40 రకాల వస్తువులపై పన్ను రేట్లు తగ్గించేందుకు చూస్తుందని తెలుస్తోంది. పన్ను రేట్లు తగ్గబోయే ఉత్పత్తుల్లో శానిటరీ న్యాప్‌కిన్‌లు, హ్యాండ్‌లూమ్స్‌, హ్యాండీక్రాఫ్ట్‌లు వంటివి ఉన్నట్టు సమాచారం. వీటన్నింటిన్నీ తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొస్తున్నట్టు సంబంధిత అధికారులు చెప్పారు. వీటిపై తుది నిర్ణయాన్ని 28న న్యూఢిల్లీలో జరుగబోయే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రకటించనున్నట్టు తెలిపారు. 

ఈ రేటు కోతతో రెవెన్యూలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. పన్ను రేట్లను హేతుబద్ధం చేస్తామని గతవారం ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు.  ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌ 328 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది. అయితే అవకాశం ఉ‍న్నట్టయితే మరికొన్ని వస్తువులపై ఈ రేట్లను తగ్గించనున్నామని తెలిపారు. కాగ, బంగారంపై మూడు శాతం పన్ను శ్లాబును తీసేస్తే, జీఎస్టీ పరిధిలో నాలుగు రకాల పన్ను శ్లాబులున్నాయి. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. ప్రస్తుతం కేవలం 49 రకాల ఉత్పత్తులే 28 శాతం పన్ను శ్లాబులో ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన సమావేశంలో పలు ఉత్పత్తులు, సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు