రెపో కోత- మార్కెట్లు పతనం

22 May, 2020 11:00 IST|Sakshi

సెన్సెక్స్‌ 407 పాయింట్లు డౌన్‌

9,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ 

రుణ చెల్లింపులపై మారటోరియం పొడిగింపు

బ్యాంక్‌ కౌంటర్లలో భారీ అమ్మకాలు

లాక్‌డవున్‌ కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటులో 0.4 శాతం కోత పెట్టింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతానికి దిగివచ్చింది. దీంతోపాటు అన్నిరకాల రుణ చెల్లింపులపై ఇప్పటికే ప్రకటించిన మూడు నెలల మారటోరియంను తిరిగి ఆగస్ట్‌ 31వరకూ పొడిగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్‌ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాట పట్టాయి. మారటోరియం పొడిగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగ కౌంటర్లలో అమ్మకాలకు ఎగబడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 407 పాయింట్లు పతనమై 30,525ను తాకగా.. నిఫ్టీ 130 పాయింట్లు నీరసించి 8,976 వద్ద ట్రేడవుతోంది. 

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3.4 శాతం పతనంకాగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం నీరసించింది. ప్రయివేట్‌ బ్యాంక్‌ కౌంటర్లలో బంధన్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌, ఇండస్‌ఇండ్‌, సిటీయూనియన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా 6-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ బాటలో పీఎస్‌యూ విభాగంలో యూనియన్‌ బ్యాంక్‌, పీఎస్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌, ఐవోబీ, ఎస్‌బీఐ, బీవోబీ, పీఎన్‌బీ, జేఅండ్‌కే బ్యాంక్‌, కెనరా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2-0.5 శాతం మధ్య క్షీణించాయి.
 

మరిన్ని వార్తలు