సిమ్‌ కార్డు అవసరం లేని ఫోన్‌

24 Feb, 2018 19:30 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీలో సరికొత్త విప్లవం

సిమ్‌ కార్డు లేకుండా ఫోన్‌ పనిచేస్తుందా? అంటే, అది అసాధ్యమని చెప్పేస్తాం. లక్ష రూపాయల ఫోన్‌ అయినా.. అది పనిచేయాలంటే సిమ్‌ కావాల్సిందే. అయితే సిమ్‌ కార్డులు అవసరం లేని ఫోన్‌ కూడా మార్కెట్‌లోకి రాబోతుందట. ఆర్మ్‌ టెక్నాలజీ సంస్థ ఈ వినూత్నాన్ని ఆవిష్కరించబోతుంది. మొబైల్‌ ఫోన్లలో వాడే సిమ్‌కి బదులుగా ఐసిమ్‌ కార్డుని(ఇంటిగ్రేటెడ్‌ సిమ్‌ కార్డును) ఆర్మ్‌ సంస్థ, ఎండబ్ల్యూసీ 2018లో ప్రదర్శించబోతుంది. ఈ సిమ్‌ కార్డు, ప్రాసెసర్‌తోనే చిప్‌సెట్‌లో ఇంటిగ్రేటెడ్‌ పార్ట్‌గా ఉండబోతుంది. ప్రాసెసర్‌ చిప్‌సెట్‌లోనే ఇంటిగ్రేటెడ్‌ అయ్యే ఐసిమ్‌ నెంబర్‌ను, ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ఐసిమ్ నెంబర్ నెట్‌వర్క్ కంపెనీలకు చెబితే, వాళ్లు దానికి మొబైల్ నెంబర్‌ను అనుసంధానిస్తారు. దీంతో సిమ్‌ కార్డుకు కేటాయించే అదనపు స్థలం మిగిలిపోతుంది. ఈ కొత్త ఐసిమ్‌ కార్డు చదరపు మిల్లిమీటర్ కంటే తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. 

ఈ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డ్ అవసరం ఉండదు. నెట్‌వర్క్ కంపెనీలకు కూడా సిమ్ కార్డ్ ఖర్చు తగ్గిపోతుంది. దీనికితోడు ప్రస్తుతం సిమ్ కార్డ్ స్లాట్ కోసం ఉపయోగిస్తున్న స్థలంలో మరికొన్ని ఆప్షన్స్‌తో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటానికి మొబైల్ తయారీ కంపెనీలకు అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో మెరుగైన వాయిస్ క్లారిటీ ఉంటుందని ఆర్మ్ టెక్నాలజీ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ దారులు, నెట్ వర్క్ సంస్థలు ఆమోదిస్తే, ఏడాది కాలంలోనే ఈ టెక్నాలజీ ఇండియాలోకి అందుబాటులోకి రానుందని సమాచారం.

మరిన్ని వార్తలు