విశాఖ ఉక్కుకు రూ.5వేల కోట్ల నష్టం!

15 Oct, 2014 12:50 IST|Sakshi
విశాఖ ఉక్కుకు రూ.5వేల కోట్ల నష్టం!

హుదూద్ తుపాను ప్రభావంపై అధికారుల ప్రాథమిక అంచనా..
స్తంభించిన విద్యుత్తు ఉత్పత్తితో నిలిచిన ప్లాంట్ నిర్వహణ
కృష్ణా ఫర్నేస్‌కు తీవ్ర నష్టం!
కోక్ ఓవెన్ పరిస్థితిపైనా ఆందోళన

 
ఉక్కునగరం, విశాఖపట్నం: చరిత్రలోనే తొలిసారిగా భారీ తుపాను విధ్వంసానికి గురైన విశాఖ  స్టీల్‌ప్లాంట్‌కు అపారనష్టం వాటిల్లింది. హుదూద్ పెను తుపాను స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత నిర్వహణనే కాకుండా భవిష్యత్తు విస్తరణ పనులపైనా ప్రతికూల ప్రభావం చూపించింది. చరిత్ర లో తొలిసారి 12 విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్ అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యు త్తు ప్లాంట్ షట్‌డౌన్ అయ్యింది. ప్రాథమిక అంచనా ప్రకారం హుదూద్ తుపాను వల్ల స్టీల్‌ప్లాంట్‌కు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.

స్టీల్‌ప్లాంట్ నిర్వహణకు ఆయువుపట్టు వంటి విద్యుత్తు ప్లాంట్ షట్‌డౌన్ కావడం ప్లాంట్‌కు అశనిపాతంగా మారింది. దాంతో ప్లాంట్‌లో ఉత్పత్తి పునఃప్రారంభించాలంటే విద్యుత్తు అవసరాల కోసం పూర్తిగా ట్రాన్స్‌కోపై ఆధారపడాల్సిన అనివార్యత ఏర్పడింది. స్టీల్‌ప్లాంట్ విస్తరణ ప్రణాళికపైనా హుదూద్ తుపాను ప్రతికూల ప్రభావం చూపింది.


ప్లాంట్‌లోని కృష్ణా బ్లాస్ట్ ఫర్నీస్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ప్లాంట్ యాజమాన్యం గోప్యత పాటిస్తోంది. ఆ ఫర్నేస్ ఆధునీకరణ పనులను జనవరిలో ప్రారంభించాలని భావిం చారు. కానీ ప్రస్తుతం తుపాను ప్రభావంతో ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో జనవరి విస్తరణ పనుల కోసం ఫర్నేస్‌ను ఇప్పటి నుంచే షట్‌డౌన్ చేయాల్సి వస్తుందని ఉక్కువర్గాలు చెబుతున్నాయి.


అదే విధంగా కోక్ ఒవెన్‌కు చెందిన నాలుగు బ్యాటరీలు ఏ స్థితిలో ఉన్నాయన్న దానిపై ఉక్కువర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరిగితేగానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాంతో ట్రాన్స్‌కో నుంచి విద్యుత్తు సరఫరా కోసం ప్లాంట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.


స్టీల్ మెల్ట్ షాపు ఐదులో మెటల్ ఉండిపోవడంతో పునరుద్ధరణ క్లిష్టం కానున్నాయి.  ఇవి కాకుండా అన్ని విశాఖకు చెందిన రూఫ్‌షీట్లు గాలికి కొట్టుకుపోవడంతో వాటి నిర్మాణానికి కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం ట్రాన్స్‌కో నుంచి విద్యుత్తు సరఫరా అత్యంత కీలకంగా మారింది.

ట్రాన్స్ కోనుంచి విద్యుత్తు సరఫరా మొదలైన 8 గంటల తరువాతే ప్లాంట్‌లో విద్యుత్తు సరఫరా ప్రారంభమవుతుంది. కానీ ఇంతవరకు ట్రాన్స్‌కో నుంచి ఆశించినరీతిలో సానుకూల స్పందన లభించలేదు.  దాంతో స్లీట్‌ప్లాంట్ అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి ఒకసారి తీసుకువెళ్లామని... మరోసారి ఈ విషయంపై ఆయనతో చర్చిస్తామని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు