‘మినిమం బ్యాలెన్స్‌’కు ఎస్‌బీఐ కత్తెర!

6 Jan, 2018 01:18 IST|Sakshi

ఎండీ పీకే గుప్తా సంకేతాలు..

విమర్శలు, కేంద్రం ఒత్తిడి నేపథ్యం

ముంబై: పొదుపు ఖాతాల కనీస నిల్వ మొత్తం (ఎంబీఏ) నిర్వహణ  నిబంధనలు... వీటిని పాటించకపోతే కస్టమర్లపై భారీ చార్జీల మోత. ఇందుకు సంబంధించి వస్తున్న తీవ్ర విమర్శలకు  ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ దిగివస్తున్నట్లు కనిపిస్తోంది. 

కనీస నిల్వను ప్రస్తుత స్థాయి నుంచి తగ్గించాలని, సగటు నిల్వ... దీనిని పాటించకపోతే జరిమానాకు వర్తించే కాలాన్ని సైతం ‘నెల’ నుంచి ‘త్రైమాసికానికి’ మార్చాలని ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంటున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఒక కస్టమర్‌ అకౌంట్లో ఒక నెలలో అవసరమైన సగటు నగదు నిల్వ కొరవడినా, మూడు నెలల్లో వచ్చే–పోయే నిధుల వల జరిమానా సమస్య నుంచి ఖాతాదారుడికి ఊరట లభించవచ్చు.
 
విమర్శల పర్వం...
ఎన్‌బీఐ చార్జీల బాదుడుపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలు, కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడులు ఎస్‌బీఐ తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. కనీస నిల్వ పాటించని కారణంగా 2017 ఏప్రిల్‌– నవంబర్‌ మధ్య కాలంలో ఎస్‌బీఐకి ఫీజులుగా రూ.1,772 కోట్లు లభించాయన్న వార్తల నేపథ్యంలో... తాజా పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం.

ఎస్‌బీఐ ప్రస్తుతం 40 కోట్ల పొదుపు ఖాతా వినియోగదారులను కలిగి ఉంది.  ప్రస్తుతం ఎస్‌బీఐ వసూలు చేస్తున్న రూ.3,000 కనీస నిల్వ విధానం ఇతర పలు ప్రభుత్వ బ్యాంకులతో పోల్చిచూస్తే ఎక్కువకాగా, ప్రైవేటు  బ్యాంకులకన్నా తక్కువ.  ‘‘నెలవారీ సగటు బ్యాలెన్స్‌పై మేము తరచూ సమీక్షిస్తున్నాం. అక్టోబర్‌లో దీనికి కొంత తగ్గించాం. మళ్లీ ఈ విషయంలో సమీక్ష ప్రక్రియలో ఉన్నాం. వచ్చిన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని బ్యాంక్‌ ఎండీ పీకే గుప్తా శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.

మరిన్ని వార్తలు