డిపాజిట్‌ రేట్లు పెంచిన ఎస్‌బీఐ 

1 Mar, 2018 00:41 IST|Sakshi
ఎస్‌బీఐ 

0.75 శాతం దాకా వడ్డీ రేటు పెంపు 

రుణాలపైనా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు 

ముంబై: బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇక నుంచి వడ్డీ రేట్ల పెరుగుదలకు సూచనగా.. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్‌ రేట్లను పెంచింది. వివిధ కాలావధులకు సంబంధించి రిటైల్, బల్క్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.75 శాతం దాకా పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెంచిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. గడిచిన నాలుగు నెలల్లో ఎస్‌బీఐ.. బల్క్‌ టర్మ్‌ డిపాజిట్‌ రేట్లు సవరించడం ఇది మూడోసారి. నవంబర్‌ ఆఖర్లో తొలిసారి రేటు సవరించిన ఎస్‌బీఐ ఆతర్వాత జనవరిలోనూ మార్చింది. తాజా పరిణామంతో రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని నిర్ణయించడానికి మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో డిపాజిట్‌ రేట్ల పెంపు సహా నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిన పక్షంలో ఆ మేరకు ఆటోమేటిక్‌గా రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలకు కూడా దారి తీస్తుంది. గత త్రైమాసికం నుంచి పలు బ్యాంకులు క్రమంగా డిపాజిట్, లోన్‌ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి.

పెరుగుదల ఇలా.. 
రెండేళ్ల నుంచి పదేళ్ల దాకా కాలవ్యవధి ఉండే రూ. 1 కోటి లోపు రిటైల్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.50 శాతం మేర పెంచుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. దీంతో ఇప్పటిదాకా 6 శాతంగా ఉన్న రేటు 6.50 శాతానికి చేరుతుంది. అలాగే, ఒక్క సంవత్సరం పైబడి.. రెండేళ్ల కన్నా తక్కువ కాలవ్యవధి ఉండే డిపాజిట్స్‌పై రేటు 0.15 శాతం మేర పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటిదాకా 6.25 శాతంగా ఉన్నది ఇకపై 6.40 శాతానికి చేరుతుంది. మరోవైపు, ఏడాది పైబడి.. రెండేళ్ల లోపు మెచ్యూరిటీ ఉండే రూ. 1 కోటి– రూ. 10 కోట్ల దాకా ఉండే బల్క్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.50 శాతం పెరిగి.. 6.25 శాతం నుంచి 6.75 శాతానికి చేరుతుంది. రెండేళ్ల పైబడి.. మూడేళ్ల లోపు కాలవ్యవధి ఉండే బల్క్‌ డిపాజిట్స్‌పై పెరుగుదల 0.75 శాతంగా ఉంటుంది.  

మరిన్ని వార్తలు