ఆస్తులను వేలం వేస్తాం: తీవ్రంగా హెచ్చరించిన సుప్రీం

12 Mar, 2018 16:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రియల్టీ సంస్థ యూనిటెక్‌ కస్టమర్లు కొనుగోలు చేసిన ఇంటిని స్వాధీనం చేయకుండా  మోసం చేసిన కేసులో సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని ఇప్పటికే పలుసార్లు ఆదేశించిన సుప్రీం సోమవారం మరింత కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గృహ కొనుగోలు దారులను దారుణంగా మోసం చేశారంటూ యూనిటెక్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు  కొనుగోలుదారులకు సొమ్మును తిరిగి చెల్లించే నిమిత్తం యునిటెక్‌కు చెందిన ఆస్తులను వేలం వేస్తామని సుప్రీం  గట్టిగా  హెచ్చరించింది. ఇందుకుగాను బోర్డు డైరెక్టర్లు వ్యక్తిగత ఆస్తులు సహా సంస్థ ఇతర దేశీ, విదేశీ ఆస్తుల వివరాలను అందించాలని ఆదేశించింది.

కాగా మార్చి 5 న, ఆస్తుల పూర్తి వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాలని కంపెనీని కోర్టు కోరింది. అయితే ఈ జాబితా అసంపూర్తిగా ఉందని సంస్థ పేర్కొంది. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సుప్రీం ధర్మాసనం దీనికి సంబంధించిన పూర్తి జాబితాను 15రోజుల్లో సమర్పించాలని చెప్పింది. తదుపరి విచారణను మార్చి 26వ తేదీకి వాయిదా వేసింది.

జెఎం ఫైనాన్స్‌, ఏఆర్‌సీకి జరిమానా
అలాగే కేసును జెఎం ఫైనాన్స్‌ లిమిటెడ్‌,ఏ ఆర్‌సీ లిమిటెడ్‌కు సుప్రీం మరో షాక్‌ ఇచ్చింది. కోర్టును తప్పు దోవ పట్టిస్తున్నారంటూ జెఎం ఫైనాన్స్‌ లిమిటెడ్‌, ఏఆర్‌సీపై సుప్రీం మండిపడింది. కస్టమర్లకు తిరిగి డబ్బులు చెల్లించేందుకు కోర్టులో సొమ్మును డిపాజిట్‌ చేస్తారని విశ్వసించాం. కానీ కస్టమర్లను సమస్యనుంచి పక్కదారి పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.

మరిన్ని వార్తలు