నాగార్జున ఆగ్రికెమ్‌పై సెబీ ఆంక్షలు ఎత్తివేత

30 Jul, 2013 03:39 IST|Sakshi

ముంబై:  పబ్లిక్‌కు కనీస వాటా నిబంధన అమలును సాధించడంతో అదానీ పోర్ట్స్, నాగార్జున అగ్రికెమ్ సంస్థలతోపాటు, డెరైక్టర్లు, ప్రమోటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. జూన్ 3లోగా పబ్లిక్‌కు కనీసం 25% వాటాను కల్పించాల్సిన నిబంధన విషయంలో విఫలమైనందుకు మొత్తం 105 కంపెనీలపై సెబీ పలు ఆంక్షలను విధించింది. ప్రమోటర్లు, డెరైక్టర్ల వోటింగ్ హక్కులు, కార్పొరేట్ లాభాలుసహా పలు అంశాలపై నియంత్రణలు అమలు చేసింది. కాగా, అదానీ పోర్ట్స్ జూన్ 7కల్లా నిబంధనలను అమలు చేయగా, నాగార్జున అగ్రికెమ్ గడువులోగానే పబ్లిక్‌కు కనీస వాటా కల్పించిందని సెబీ తెలిపింది. అయితే ఈ విషయాన్ని నాగార్జునా తెలియజేయడంలో విఫలమైనందున ఆంక్షలను విధించినట్లు వె ల్లడించింది.
 
 పవన విద్యుత్ నుంచి వైదొలుగుతున్న నాగార్జునా అగ్రికెమ్
 కాగా పవన్‌విద్యుత్ నుంచి పూర్తిగా వైదొలగాలని నాగార్జునా అగ్రికెమ్ నిర్ణయించుకుంది. కంపెనీకి చెందిన మూడు పవన విద్యుత్ టర్బైన్ జనరేటర్ ప్లాంట్లను అమ్మడం లేదా ఇతరులకు బదలాయించాలని నిర్ణయించింది.  కంపెనీకి తమిళనాడులోని తిరునేల్వేలి జిల్లాలో  2.1 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు టర్బైన్ల ప్లాంట్లు ఉన్నాయి. ఈ లావాదేవీలకు సంబంధించిన పూర్తి అధికారాలను మేనేజింగ్ డెరైక్టర్‌కు అప్పగించింది.

>
మరిన్ని వార్తలు