వెలుగులో మెటల్, సిమెంట్ షేర్లు

7 Apr, 2016 00:54 IST|Sakshi
వెలుగులో మెటల్, సిమెంట్ షేర్లు

రోజంతా సూచీల హెచ్చుతగ్గులు
చివరకు స్వల్పంగా కోలుకున్న మార్కెట్

 ముంబై: రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని క్రితంరోజు చవిచూసిన భారత్ మార్కెట్ బుధవారం స్వల్పంగా కోలుకుంది.  రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను పావుశాతమే పెంచడంతో మంగళవారం సెన్సెక్స్ 516 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. తాజాగా మెటల్, సిమెంట్ షేర్లలో జరిగిన కొనుగోళ్ల ఫలితంగా స్వల్ప రికవరీ సాధ్యపడింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశపు మినిట్స్ బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ట్రేడింగ్ కూడా మందకొడిగా సాగింది.

దాంతో 25,000-24,834 పాయింట్ల మధ్య స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 17 పాయింట్ల పెరుగుదలతో 24,901 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల పెరుగుదలతో 7,614 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మందకొడిగా వున్నందున, భారీ పెరుగుదల సాధ్యపడలేదని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు.

 టాటా స్టీల్ టాప్ గెయినర్...
మెటల్, సిమెంటు షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. యూరప్ ప్లాంట్ల అమ్మకానికి సంబంధించిన లావాదేవీ త్వరలో జరగవచ్చనే అంచనాలతో పాటు ఒడిస్సా మైనింగ్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ క్లియరెన్స్ రావడంతో టాటా స్టీల్  5.24 శాతం పెరిగి రూ. 328 వద్ద ముగిసింది. ఇదేబాటలో హిందాల్కో 4.5 శాతం, వేదాంత 2 శాతం మేర పెరిగాయి. సిమెంటు షేర్లు అల్ట్రాటెక్, ఏసీసీ, గ్రాసిమ్‌లు 1.5-3 శాతం మధ్య ర్యాలీ జరిపాయి.

>
మరిన్ని వార్తలు