ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్‌

29 Nov, 2017 02:05 IST|Sakshi

జీడీపీ గణాంకాలు రానున్న నేపథ్యంలో అప్రమత్తత 

106 పాయింట్లు క్షీణించి 33,619కు సెన్సెక్స్‌ 

29 పాయింట్ల నష్టంతో 10,370కు నిఫ్టీ  

ముంబై: సెప్టెంబర్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాలు రేపు (గురువారం)వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. దీంతో వరుస ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్ల లాభాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 106 పాయింట్ల నష్టంతో 33,619 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 10,370 పాయింట్ల వద్ద ముగిశాయి. గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 964 పాయింట్లు లాభపడింది. రేపు నవంబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో స్టాక్‌ సూచీలు హెచ్చుతగ్గులకు గురికావడం,  అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాలు జోరుగా జరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. 

ఇటీవల లాభపడిన కన్సూమర్‌ డ్యూరబుల్స్, ఫార్మా, ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అయితే డాలర్‌తో రూపాయి మారకం లాభాల్లోన కొనసాగడంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు తగ్గాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 46 పాయింట్లు లాభపడగా, మరో దశలో 148 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద    194 పాయింట్ల రేంజ్‌ లో కదలాడింది.  దిగుబడి తగ్గి, ధరలు పెరుగుతాయనే అంచనాలతో గత వారం రోజులుగా జరుగుతున్న టీ షేర్ల ర్యాలీ మంగళవారం కూడా కొనసాగింది. 

ఆర్‌కామ్‌ 3.3 శాతం డౌన్‌...:  చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(సీడీబీ).. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీలో దివాలా చట్టం కింద కేసు దాఖలు చేసిందన్న వార్తల నేపథ్యంలో ఆర్‌కామ్‌ షేర్‌ 3.3 శాతం క్షీణించి రూ.12.90 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 9 శాతం వరకూ నష్టపోయింది. కాగా ఎన్‌సీఎల్‌టీలో సీడీబీ కేసు దాఖలు చేసినట్లుగా తమకెలాంటి నోటీసు అందలేదని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు