ర్యాలీకి బ్రేక్‌ స్వల్పంగా తగ్గిన సూచీలు

5 Jul, 2017 02:10 IST|Sakshi
ర్యాలీకి బ్రేక్‌ స్వల్పంగా తగ్గిన సూచీలు

ముంబై: వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లుగా జరుగుతున్న మార్కెట్‌ ర్యాలీకి మంగళవారం బ్రేక్‌పడింది. రోజంతా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన స్టాక్‌ సూచీలు చివరకు స్వల్పనష్టాలతో ముగిసాయి. 187 పాయింట్ల మేర అటూ, ఇటూ ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 12 పాయింట్ల నష్టంతో 31.210 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,650–9,595 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు గురై 2 పాయింట్ల నష్టంతో 9,613 పాయింట్ల వద్ద ముగిసింది. దక్షిణ కొరియా క్షిపణిని ప్రయోగించడంతో భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తుతాయన్న భయాలతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారని, దాంతో మార్కెట్‌ మందకొడిగా ముగిసిందని విశ్లేషకులు చెప్పారు. ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ముగిసాయి. యూరప్‌ సూచీలు స్వల్పనష్టాల్ని చవిచూడగా, అమెరికా మార్కెట్లకు మంగళవారం సెలవు.

21 సెన్సెక్స్‌ షేర్లకు నష్టాలు...
సెన్సెక్స్‌–30 షేర్లలో 21 షేర్లు నష్టాలతో ముగిసాయి. యాక్సిస్‌బ్యాంక్‌ అన్నింటికంటే అధికంగా 2.08 శాతం తగ్గుదలతో రూ. 507 వద్ద ముగిసింది. హీరో మోటో కార్ప్‌ కూడా 2 శాతంపైగా నష్టపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్, ఐటీసీ, సిప్లా, షేర్లు 1–2 శాతం మధ్య తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.73 శాతం తగ్గింది.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు మాత్రం 2.8 శాతం ర్యాలీ జరిపి రూ. 1,423 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు