4 రోజుల లాభాలకు బ్రేక్‌

8 Feb, 2020 05:51 IST|Sakshi

లాభాల స్వీకరణతో మార్కెట్‌ పతనం  

గత నాలుగు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఈ వారంలో తొలిసారిగా నష్టాలు నమోదయ్యాయి. చైనాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 636కు చేరడం, ఈ  వైరస్‌ భయాలు మళ్లీ చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు పతనమై 71.43కు పడిపోవడం (ఇంట్రాడేలో) ప్రతికూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, మార్కెట్‌ నష్టాలు తగ్గలేదు.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 164 పాయింట్లు పతనమై 41,142 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 12,098 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 1,406 పాయింట్లు(3.5 శాతం),  నిఫ్టీ 437 పాయింట్ల (3.7 శాతం)మేర లాభపడ్డాయి.  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.6 శాతం నష్టంతో రూ.1,299 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.
 

మరిన్ని వార్తలు