మార్కెట్‌ అక్కడక్కడే..

19 Oct, 2017 03:56 IST|Sakshi

25 పాయింట్ల నష్టంతో 32,584కు సెన్సెక్స్‌

24 పాయింట్ల నష్టంతో 10,211కు నిఫ్టీ  

ముంబై: స్టాక్‌ సూచీలు బుధవారం అక్కడక్కడే ముగిశాయి. అయితే సంవాత్‌ 2073 మంచి లాభాలతోనే ముగిసింది. స్టాక్‌ మార్కెట్‌ 16 శాతం లాభపడగా, ఇన్వెస్టర్ల సంపద రూ.25 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 4,643 పాయింట్లు(16.61 శాతం), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,573 పాయింట్లు(18.20 శాతం) చొప్పున లాభపడ్డాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ ఆద్యంతం ఒడిదుడుకులకు గురైంది. స్టాక్‌ సూచీలు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో సూచీలు రికార్డ్‌ స్థాయిలకు ఎగిసిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  మధ్యాహ్నం వరకూ నష్టాల్లో ఉన్న సూచీలు ఆ తర్వాత కొంత రికవరీ అయినప్పటికీ, చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో  61 పాయింట్లు లాభపడగా, మరో దశలో 146 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 207 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  ఇంట్రాడేలో నిఫ్టీ 10,176, 10,236 పాయింట్ల మధ్యన  మొత్తం 60 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. సెన్సెక్స్‌ 25 పాయింట్ల నష్టంతో 32,584 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 10,211 పాయింట్ల వద్ద ముగిశాయి. దీపావళి సందర్బంగా సుదీర్ఘ సెలవులున్నందున్న ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. డాలర్‌తో రూపా యి మారకం బలహీనపడడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది.

యాక్సిస్‌ బ్యాంక్‌ 10 శాతం డౌన్‌...
మొండి బకాయిల సెగ బ్యాంక్‌ షేర్లను అల్లాడిస్తోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ పేర్కొన్నారు. కానీ రానున్న రోజుల్లో జీఎస్‌టీ సంబంధిత సానకూలాంశాల కోసం మార్కెట్‌ ఎదురుచూస్తోందని వివరించారు. క్యూ2లో మొండి బకాయిలు భారీగా పేరకుపోవడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 10 శాతం వరకూ పతనమైంది. సెన్సెక్స్‌ షేర్లలో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఎస్‌బీఐ, లుపిన్, సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్, హిందుస్తాన్‌ యూనిలివర్, బజాజ్‌ ఆటో, హీరో మోటొకార్ప్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్‌ అండ్‌ టీ, టాటా స్టీల్‌ షేర్లు 4 శాతం వరకూ నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4.5 శాతం లాభపడి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ క్యూ2లో నికర లాభం 6 శాతం పెరగడంతో విప్రో షేర్‌ 2 శాతం వరకూ లాభపడింది

నేడు ప్రత్యేక ముహురత్‌ ట్రేడింగ్‌
దీపావళి సందర్బంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. అయితే ప్రత్యేక ముహురత్‌ ట్రేడింగ్‌ను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు నిర్వహించనున్నాయి. సాయంత్రం గం.6.30కు ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక  ట్రేడింగ్‌ గంట పాటు కొనసాగి గం.7.30ని. ముగుస్తుంది. ముహురత్‌ అంటే శుభప్రదమైన సమయమని అర్థం. ఈ సమయంలో ట్రేడ్‌ చేస్తే మంచి ఫలితాలు వచ్చి, సంపద వృద్ధి చెందుతుందని ఇన్వెస్టర్లు, ట్రేడర్లు విశ్వసిస్తారు. ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ను 1979 నుంచి బీఎస్‌ఈ నిర్వహిస్తోంది.

శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు..
దీపావళి బలప్రతిపదా(బలి పాడ్యమి) సందర్భంగా రేపు (శుక్రవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు.

మరిన్ని వార్తలు