28 వేల దిగువకు సెన్సెక్స్

20 Oct, 2016 01:30 IST|Sakshi
28 వేల దిగువకు సెన్సెక్స్

67 పాయింట్ల నష్టంతో 27,984కు సెన్సెక్స్
19 పాయింట్ల నష్టంతో 8,659కు నిఫ్టీ 

అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండడం, లాభాల స్వీకరణ కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 27,984 పాయంట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 8,659 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్తు, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్, పార్మా, కన్సూమర్ డ్యూరబుల్స్, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలకు కళ్లెం పడింది.

లాభాల్లోంచి నష్టాల్లోకి...
నేడు (గురువారం) జరిగే యూరప్ కేంద్ర బ్యాంక్ సమావేశం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురైందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ స్రవీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. అయితే జీఎస్‌టీ మండలి సమావేశం ఫలితంగా సానుకూల నిర్ణయం వెలువడుతుందన్న అంచనాలు ప్రపంచ ఒడిదుడుకుల నుంచి మనల్ని గట్టెక్కిస్తాయని పేర్కొన్నారు.  విదేశీ పెట్టుబడులు నిలకడగా కొనసాగుతుండడం,చైనా ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ది సాధించడం వంటి సానుకూలాంశాలతో సెన్సెక్స్‌లాభాల్లోనే ప్రారంభమైంది. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ ఐదు నెలల్లోనే అత్యధిక  (521) పాయింట్లు లాభపడిన నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఆర్థిక రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో స్టాక్ సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి.

 భెల్ 3.7 శాతం అప్: భెల్ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, సీఎల్‌ఎస్‌ఏ అప్‌గ్రేడ్ చేయడంతో భెల్ షేర్ 3.7% లాభపడి రూ.141వద్ద ముగిసింది. గత 6 వారాల్లో ఈ షేర్ 15% పతనం కావడం, ఎన్నోర్ ప్రాజెక్ట్ విషయంలో తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌పై చట్టపరంగా విజయం సాధించడం వల్ల సీఎల్‌ఎస్‌ఏ సంస్థ భెల్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది.  నేడు ఆర్థిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆర్‌ఐఎల్ 0.7% పెరిగి రూ. 1,087 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు