ఎగ్జిట్‌ పోల్స్‌తో ఎగిసిన సూచీలు

16 Dec, 2017 00:46 IST|Sakshi

ఇంట్రాడేలో 375 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

చివరకు 216 పాయింట్ల లాభంతో 33,463 వద్ద ముగింపు

గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి కాగలదన్న ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో స్వాగతించింది. స్టాక్‌ సూచీల లాభాలు రెండో రోజూ కొనసాగాయి. దాదాపు రెండు వారాల గరిష్ట స్థాయిలో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 216 పాయింట్ల లాభంతో 33,463 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 10,333 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, రియల్టీ, కన్సూమర్‌ డ్యూరబుల్స్, వాహన, క్యాపిటల్‌ గూడ్స్, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 213 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్టాక్‌ సూచీలు లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో వారం. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 3 నెలల గరిష్టాన్ని తాకడం సానుకూల ప్రభావం చూపించింది. శనివారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుండడం, విదేశీ ఇన్వెస్టర్లు గురువారం రూ.232 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారన్న గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 375 పాయింట్ల లాభంతో 33,622 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్‌ 216 పాయింట్ల లాభంలో  ఆరు ప్రధాన షేర్ల (హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్, కోల్‌ ఇండియాల) వాటానే  183 పాయింట్ల వరకూ ఉండడం విశేషం.

సెన్సెక్స్‌లో రెండు కొత్త షేర్లు
సోమవారం (ఈ నెల 18) నుంచి సెన్సెక్స్‌లో రెండు కొత్త షేర్లు– ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యస్‌బ్యాంక్‌లను చేర్చనున్నారు. ఈ కారణంగా యస్‌ బ్యాంక్‌ 4 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.6 శాతం చొప్పున లాభపడ్డాయి. సిప్లా, లుపిన్‌ షేర్ల స్థానంలో ఈ రెండు షేర్లను చేరుస్తున్నారు.

బోధ్‌ట్రీ లాభం రూ.47 లక్షలు
సెప్టెంబరు త్రైమాసికంలో బోధ్‌ట్రీ కన్సల్టింగ్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.51 లక్షల నుం చి రూ.47 లక్షలకు తగ్గింది. టర్నోవరు రూ.13.6 కోట్ల నుంచి రూ.11.6 కోట్లుగా నమోదైంది.  

పిట్టి లామినేషన్స్‌ లాభం 3 రెట్లు
ఇదే త్రైమాసికంలో పిట్టి లామినేషన్స్‌ లాభం క్రితంతో పోలిస్తే మూడు రెట్లకుపైగా పెరిగి రూ.3.33 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.71 కోట్ల నుంచి రూ.84 కోట్లకు చేరింది. 

నెట్‌లింక్స్‌కు 86 లక్షల నష్టం
నెట్‌లింక్స్‌ రూ.86 లక్షల నష్టం పొందింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1.17 కోట్ల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.6 కోట్ల నుంచి రూ.4 కోట్లకు తగ్గింది. 

మరిన్ని వార్తలు