ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు రేసులో టాటా, ఆర్సెలర్‌ మిట్టల్‌

30 Oct, 2017 03:31 IST|Sakshi

ఎస్సార్‌ గ్రూప్‌ కూడా...  

న్యూఢిల్లీ: రుణ బకాయిలు చెల్లించలేక దివాలా కోరల్లో చిక్కుకున్న ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు దేశీ, విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. ప్రధానంగా టాటా స్టీల్, ఆర్సెలర్‌ మిట్టల్‌తో పాటు ఎస్సార్‌ గ్రూప్‌ కూడా బిడ్‌లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్సార్‌ స్టీల్‌ ఇండియాకు రుణాలిచ్చిన బ్యాంకులు ఇప్పటికే దివాలా చట్టం ప్రకారం కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను(సీఐఆర్‌పీ) మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ కంపెనీని విక్రయించడం కోసం అక్టోబర్‌ 23న కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్‌లను ఆహ్వానించారు. తాము కూడా ఈఓఐను సమర్పించామని, పరిష్కార ప్రణాళికను నిర్దేశిత కాలవ్యవధిలోపే సమర్పిస్తామని ఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధి వెల్లడించారు. కాగా, బిడ్డింగ్‌లో పాల్గొనడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్నకు... దివాలా చట్టం ప్రకారం ప్రమోటర్లు(ఎస్సార్‌ గ్రూప్‌) కూడా దివాలా ప్రక్రియలో ఉన్న తమ సొంత కంపెనీ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎన్‌సీఎల్‌టీ(నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) చేపడుతున్న ఈ దివాలా ప్రక్రియలో తమను నిలువరించేలా ఎలాంటి పరిమితులూ లేవని... అమెరికా, బ్రిటన్‌తో సహా అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో సైతం ఇదే విధానం అమల్లో ఉందని వివరించారు. మరోపక్క, బిడ్‌కు జతగా రష్యా ఆర్థిక సంస్థ వీటీబీ క్యాపిటల్‌ నుంచి నిధుల హామీ పత్రాన్ని కూడా ఎస్సార్‌ గ్రూప్‌ సమర్పించినట్లు సమాచారం. వీటీబీ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఇది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీటీబీ బ్యాంక్‌లో రష్యా ప్రభుత్వానికి మెజారిటీ (60.9 శాతం) వాటా ఉంది. కాగా, ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆసక్తి లేదని వేదాంత ప్రతినిధి స్పష్టం చేశారు.


అప్పులు రూ.45 వేల కోట్లు...
ఎస్సార్‌ స్టీల్‌ ఇండియాకు దేశంలో వార్షికంగా కోటి టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని పారదీప్‌లలో 2 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన బెనిఫికేషన్, పెల్లెట్‌ తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. ఇప్పటివరకూ తాము రూ.5 వేల కోట్లమేర పెట్టుబడులు పెట్టామని ఎస్సార్‌ స్టీల్‌ చెబుతోంది.

ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటివరకూ రూ.16,000 కోట్లను సమీకరించినట్లు తెలిపింది. ప్రత్యక్షంగా 5 వేల మంది, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది. రూయాలకు చెందిన ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోట్‌ చేసిన మరో కంపెనీ ఎస్సార్‌ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, దివాలా ప్రక్రియను ఆమలు చేయాలంటూ ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశించిన 12 కంపెనీల తొలి జాబితాలో ఎస్సార్‌ స్టీల్‌ కూడా ఒకటి.

దివాలా చట్టం ప్రకారం ఎస్సార్‌ స్టీల్, భూషణ్‌ స్టీల్, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌పై ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బకాయిల వసూలు కోసం ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ను దాఖలు చేశాయి. బ్యాంకులకు ఎస్సార్‌ స్టీల్‌ చెల్లించాల్సిన రుణ బకాయిలు దాదాపు రూ.45,000 కోట్లుగా అంచనా. 

మరిన్ని వార్తలు