వ్యాపారాలపైనే పూర్తి దృష్టిపెట్టండి..

26 Oct, 2016 00:36 IST|Sakshi
సీఈఓలతో భేటీ తర్వాత బాంబే హౌస్ వెలుపల రతన్ టాటా

గ్రూప్ కంపెనీల సీఈఓలకు రతన్ టాటా ఉద్బోధ
ముంబై: మిస్త్రీ తక్షణ తొలగింపు.. తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఈ హఠాత్ పరిణామం గ్రూప్ కంపెనీల ఉద్యోగులు, అత్యున్నత స్థాయి అధికారులపై ప్రతికూల ప్రభావం చూపకుండా అప్రమత్తమయ్యారు. మంగళవారం గ్రూప్ కంపెనీలకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ)లతో సమావేశమయ్యారు. ముఖ్యంగా సారథ్యం మార్పుపై ఆందోళన చెందకుండా తమతమ వ్యాపారాలపై పూర్తిగా దృష్టికేంద్రీకరించాలని.. వాటాదారులకు మరింత రాబడులను అందించడమే పరమావధిగా పనిచేయాలని సీఈఓలకు ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

‘పరిస్థితులను పూర్తిగా మదింపు చేశాక అవసరమైతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం. ఏవైనా మార్పులు చేర్పులుంటే మీతో(సీఈఓలు) చర్చించాకే జరుగుతాయి. నా నియామకం తాత్కాలికమే. కొంతకాలం మాత్రమే నేను కొనసాగుతాను. గ్రూప్ వ్యాపారాల్లో స్థిరత్వం, ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా చూడటం కోసమే ఈ బాధ్యతలను స్వీకరించా. కాబట్టి నాయకత్వ శూన్యం ఏమీ లేనట్టే. కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియను త్వరలోనే మొదలుపెడతాం.

మార్కెట్లో పూర్తిస్థాయి ఆధిపత్యమే లక్ష్యంగా ముందుకెళ్లండి’ అని రతన్ పేర్కొన్నారు. కాగా, మిస్త్రీ తొలగింపునకు దారితీసిన కారణాలను ఆయన సీఈఓలతో చర్చించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైర్మన్ పదవి నుంచి దిగి పోయినా.. మిస్త్రీ టాటా సన్స్, గ్రూప్ కంపెనీల్లో డెరైక్టర్‌గా కొనసాగనున్నారు. కొత్త చైర్మన్ ఎంపికకు ఐదుగురి సభ్యులతో అన్వేషణ కమిటీని బోర్డు ప్రకటించింది.

మరిన్ని వార్తలు