రతన్‌ టాటా కలల కారు ‘నానో’.. ఎలక్ట్రిక్‌ కారుగా వస్తుందా? అందులో నిజమెంత?

13 Oct, 2023 15:35 IST|Sakshi

రతన్‌ టాటా ! పరిచయం అక్కర్లేని పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న ధీశాలి. పద్మ అవార్డుల గ్రహీత. మంచితనం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శం. నమ్మకంతో కూడిన నాయకత్వం, నైతిక విలువలు, ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. రూ. వేల కోట్ల సంపద ఉన్నా కూడా సాధారణ జీవితం గడుపుతున్న అసామన్యుడు.

అలాంటి రతన్‌ టాటాకు ‘నానో’ కారంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ కారే భారత మార్కెట్‌లో తిరిగి  ఎలక్ట్రిక్‌ వెహికల్‌గా విడుదలవుతుందుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ నానో ఎలక్ట్రిక్‌ కారుగా రాబోతుందా? సోషల్‌ మీడియా పోస్టుల్లో నిజమెంత?

త్వరలో, టాటా గ్రూప్‌ నానో ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేస్తుందంటూ నానో’ పోలికతో ఉన్న ఓ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అంతేకాదు, టాటా నానో న్యూ అవతార్‌. కారు ధర రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుందనే ఆ ఫేక్‌ సోషల్‌ మీడియా ఫోటో సారాశం. 

ఇంతకీ నానో తరహాలో ఉన్న ఆ కారును ఏ ఆటోమొబైల్‌ కంపెనీ తయారు చేస్తుందనే అనుమానం రావొచ్చు. జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా 998 సీసీ పెట్రోల్‌ ఇంజిన్‌తో ‘టయోటా ఐగో’ హ్యాచ్‌బ్యాక్‌ కారును అమ్ముతుంది. కానీ ఈ కారు భారత్‌లో మాత్రం అందుబాటులో లేదు.

గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈవీ కార్ల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. వాటి బడ్జెట్‌ ఎక్కువ కావడంతో వాహనదారులు టాటా గ్రూప్‌ బడ్జెట్‌ ధరలో ఈవీ కారును అందుబాటులోకి తెస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదిగో అప్పటి నుంచి టాటా సంస్థ నానో ఈవీ కారు వస్తుందనే ప్రచారం జోరందుకుంది. తాజాగా, టాయోటా ఐగో కారు ఫోటోల్ని చూపిస్తూ.. ఇదే టాటా నానో ఈవీ కారు అంటూ ఫోటోలు విడుదలయ్యాయి. అయితే, ఆ ఫోటోలు ఫేక్‌ అని తేలింది.

నానో కారు ఇలా పుట్టిందే
నానో కారు.. 15 ఏళ్ల క్రితం ఆటోమొబైల్‌ రంగంలో అదో పెను సంచలనం. రతన్‌ టాటా ప్రతి రోజు తన కారులో వెళ్లే సమయంలో స్కూటర్లపై వెళ్లుతున్న తల్లిదండ్రుల మధ్యలో కూర్చొవడం గమనించాను. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. అలా పురుడు పోసుకుందే నానో కారు. 

ప్రపంచంలో అత్యంత చౌకైన కారు.. కానీ
2008 జనవరి 10న టాటా మోటార్స్‌ ‘నానో’ కారును విడుదల చేసింది. సామాన్యుల కోసం టాటా కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందింది. అయితే క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయి పూర్తిగా కనుమరుగైంది.

చదవండి👉ముద్ద‌ ముట్ట‌ని పెంపుడు కుక్క‌లు, ప్రిన్స్‌ ఛార్లెస్‌ అవార్డు కార్యక్రమానికి ‘రతన్‌ టాటా’ డుమ్మా!

మరిన్ని వార్తలు