థాయ్లాండ్లోనే ఖర్చు తక్కువ

23 Aug, 2016 04:12 IST|Sakshi
థాయ్లాండ్లోనే ఖర్చు తక్కువ

భారత్‌తో పోలిస్తే 30 శాతం చౌక
ఏటా 2.9 కోట్ల మంది పర్యాటకులు
థాయ్‌లాండ్ టూరిజం డెరైక్టర్ సొరయ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పర్యాటకులకు భారత్‌లో స్థానికంగా పర్యటించే ఖర్చుతో పోల్చినా తమ దేశంలోనే తక్కువని థాయ్‌లాండ్ టూరిజం పేర్కొంది. కాశ్మీర్‌లో అయ్యే వ్యయంతో పోలిస్తే 30 శాతం ఆదా చేసుకోవచ్చని టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్‌లాండ్ (టీఏటీ) డెరైక్టర్ సొరయ హోమ్‌చెన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘‘నలుగురు సభ్యుల కుటుంబం వారం రోజులు గనక థాయ్‌లాండ్‌లో ఉంటే వసతి, భోజన ఖర్చులకు రూ.2 లక్షలు అవుతుంది.

ప్రయాణ చార్జీలు మాత్రం వీటికి అదనం. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్ నగరాలు ఇప్పటికే భారతీయుల దృష్టిలో చాలా పాపులర్’’ అని చెప్పారామె. తేలియాడే హోటళ్లు, వాటర్ ఫాల్స్, రిసార్టులు ఎక్కువగా ఉన్న కాంచనబురి నగరంతోపాటు చియాంగ్‌మాయ్, చియాంగ్ రాయ్, హువాహిన్, రేయాంగ్, కోహ్ సామెట్, కోహ్ చాంగ్, కోహ్ సమూయ్ వంటి ప్రాంతాలను కొత్తగా తాము ప్రమోట్ చేస్తున్నట్టు తెలియజేశారు.

 వేడుకలకు వేదిక..
ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఏటా 800 సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని, ఇందులో భారతీయ సినిమాలు 100కుపైగా ఉంటున్నాయని టీఏటీ తెలియజేసింది. మహిళల కోసం, అలాగే బ్యాచిలర్స్ కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ఈ ఏడాది ఆఫర్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

 భవిష్యత్ మార్కెట్..
ఖర్చు చేయగలిగే ఆదాయం పెరగడం, జనాభాలో 50% యువత ఉండడం వంటి కారణాలతో భారతదేశం నుంచి థాయ్‌కి పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు థాయ్ టూరిజం తెలియజేసింది. పర్యాటకుల నుంచి ఆదాయం పరంగా థాయ్‌లాండ్ 7వ స్థానంలో ఉంది. 2015లో 2.9 కోట్ల మంది పర్యాటకులు థాయ్‌లో అడుగుపెట్టారు. భారత్ నుంచి ఈ సంఖ్య 10 లక్షలుంది. చైనా, మలేషియా, జపాన్, కొరియా, లావోస్ తర్వాత భారత్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వెళ్తున్నారు. మన దేశం నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య ఏటా 10% వృద్ధి చెందుతోంది.

 భారత్‌కు రావడం కష్టం..
థాయ్‌లాండ్‌లో అడుగుపెట్టిన పర్యాటకులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. ఈ అంశమే ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తోంది. ప్రపంచ టాప్-20 ఆకట్టుకునే దేశాల్లో థాయ్ స్థానం సంపాదించుకుంది కూడా. వేలాది దర్శనీయ స్థలాలున్నా థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు ఏటా లక్ష మంది మాత్రమే పర్యాటకులు వస్తున్నారు. వీసా ఆన్ అరైవల్ సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణమని, భారత పర్యాటక రంగానికి ఇది పెద్ద అడ్డంకి అని సొరయ తెలిపారు.

>
మరిన్ని వార్తలు