ఎంసెట్ సహా అన్ని సెట్లూ ఆన్‌లైన్‌లోనే! | Sakshi
Sakshi News home page

ఎంసెట్ సహా అన్ని సెట్లూ ఆన్‌లైన్‌లోనే!

Published Tue, Aug 23 2016 12:39 AM

ఎంసెట్ సహా అన్ని సెట్లూ ఆన్‌లైన్‌లోనే! - Sakshi

- వచ్చే ఏడాది నుంచి నిర్వహణ
- సెట్ల వారీగా కమిటీల ఏర్పాటు
- డిసెంబర్‌లోగానే ముందస్తు ప్రక్రియ పూర్తి
- సెట్ల అడ్మిషన్ల కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్ వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్ : ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలను వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్లో నిర్వహించడానికి ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సెట్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు వచ్చేనెల మొదటి వారంలో సమావేశమై ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు అన్ని అంశాలపై చర్చించి సిఫార్సులు చేస్తాయని సెట్ల అడ్మిషన్ల కమిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాథ్ సాక్షితో తెలిపారు. ఆ సిఫార్సులను అనుసరించి ఉన్నత విద్యామండలి తదుపరి చర్యలు చేపడుతుందన్నారు. సెట్ల నోటిఫికేషన్లు డిసెంబర్‌కల్లా ఇవ్వాల్సి ఉంటుందని, ఆలోగానే ముందస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని వివరించారు.

 పాత విధానంలో అనేక సమస్యలు
 ఆన్‌లైన్‌లో పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో తగినన్ని పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేనందున సెట్ల పరీక్షలను పాతవిధానంలోనే నిర్వహిస్తున్నారు. దీనివల్ల అనేక వ్యయప్రయాసలు ఏర్పడుతున్నాయి. దీనికితోడు ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఏటా వెన్నాడుతోంది. ఈ ఏడాదిలో తెలంగాణ నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైన కారణంగా తీవ్ర గందరగోళంలో పరీక్షను రద్దుచేయడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యా రు. ఈ పరిణామాలతో ఏపీలో వచ్చే ఏడాది నుంచి వివిధ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేపట్టింది.
 
 ఉన్నత విద్యా మండలి పరిధిలో ఏటా 8 సెట్లు
 ఉన్నత విద్యామండలి ఏటా బీటెక్, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, ఫార్మా డీ కోర్సులకు ఎంసెట్.. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లోకి డిప్లొమో అభ్యర్థుల ప్రవేశానికి ఈసెట్.. ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు ఐసెట్.. బీఈడీ ప్రవేశానికి ఎడ్‌సెట్.. లా కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు పీజీఎల్‌సెట్.. బీపీఈఈ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి పీఈసెట్.. ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా డీకోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌లను నిర్వహిస్తోంది. ఎంసెట్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి జాతీయస్థాయిలో నీట్‌ను తప్పనిసరి చేస్తున్నందున ఇక మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అవకాశాల్లేవు. కేవలం ఇంజనీరింగ్ ప్రవేశాల వరకు మాత్రమే ఆన్‌లైన్లో నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఆదరణ క్రమేణా తగ్గిపోతున్న బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అతితక్కువ మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీటికి కూడా ఆన్‌లైన్ పరీక్షలు పెట్టాలా, లేదా పాత పద్ధతిలోనే కొనసాగించాలా? అన్నది కమిటీల సమావేశంలో నిర్ణయించనున్నారు.

Advertisement
Advertisement