అమెరికా-భారత్ సీఈఓ ఫోరం సారథిగా మిస్త్రీ

24 Jan, 2015 15:30 IST|Sakshi
అమెరికా-భారత్ సీఈఓ ఫోరం సారథిగా మిస్త్రీ

26న సమావేశం; ఒబామా, మోదీ ప్రసంగం!

 న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటకు వస్తున్న నేపథ్యంలో యూఎస్-ఇండియా సీఈఓ ఫోరంలో మార్పులు జరిగాయి. ఫోరం కో-చైర్మన్‌గా టాటా గ్రూప్ చీఫ్ సైరస్ మిస్త్రీ నియమితులయ్యారు. భారత్ తరఫున సీఈఓలకు ఆయన నేతృత్వం వహిస్తారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో రతన్ టాటా ఉన్నారు. కాగా, ఫోరంలోకి కొత్త సభ్యుడిగా అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని చేర్చారు. ఇక ఫోరంలో అమెరికా సీఈఓలకు హనీవెల్ చీఫ్ డేవిడ్ ఎం కోట్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ నెల 26న సీఈఓల ఫోరం భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. 

ఫోరంలో భారత్ నుంచి 17 మంది సభ్యుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ గ్రూప్ చీఫ్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ-ఎండీ చందా కొచర్, ఎస్సార్ గ్రూప్ శశి రూయా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తదితర దిగ్గజాలు ఉన్నారు. ఇక అమెరికాతరఫున పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి తదితరులు ఉన్నారు. భారత్ నుంచి ఐటీ ఇతరత్రా నిపుణులకు అమెరికా వీసాల జారీలో ఇబ్బందులతో పాటు ద్పైక్షిక వ్యాపార సంబంధాలపై ఫోరం సమావేశంలో చర్చించనున్నారు.
 

 

మరిన్ని వార్తలు